చండ్రుగొండ/ అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, మార్చి 17: తెలంగాణలో మం త్రులే కాంట్రాక్టర్లయితే బడ్జెట్ వారికే సరిపోతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జా టోత్ హుస్సేన్‌నాయక్ ధ్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులున్నా.. ఈ ప్రాంత పేదలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. సీతాయిగూడెం శివారులోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు తెగిన ప్రదేశాన్ని పరిశీలించి, ప్రాజెక్టు అలుగు నిర్మాణంపై నెల రోజుల్లో నివేదకని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.17 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం సరికాదన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో నిరుడు దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టును పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు.