కోదాడ : కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వందల కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్లదేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మేళ్లచెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్లో రెండు నియోజకవర్గాల సోషల్ మీడియా వారియర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండు నియోజకవర్గాలలో దవాఖానలు, రోడ్లు, సాగు నీరు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఎత్తిపోతల పథకాలు తదితర అభివృద్ధి పనులపై ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్‌లలో పోస్టులు పొందుపర్చి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించే విధంగా సోషల్ మీడియా వారియర్లు కృషి చేయాలన్నారు. నిబద్ధతగా పనిచేసే సోషల్ మీడియా వారియర్లకు సంపూర్ణ గౌరవం, గుర్తింపుతోపాటు తగిన సాయం కూడా చేస్తామని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా శ్రీధర్ రామస్వామి బాధ్యత వహిస్తారని మంత్రి చెప్పారు. తటస్థ ఓటర్లు సహాయక సంఘాలు, వాట్సాప్ గ్రూపులు, చానళ్లు సృష్టించి వారికి మన పోస్టులు చేరేవిధంగా చూడాలని సూచించారు. అదేవిధంగా తప్పుడు ప్రచారాలను ఖండించాలని, వాస్తవ పోస్టులను పొందుపరచాలని తెలిపారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు 600 పోలింగ్ బూతులకు సోషల్ మీడియా వారియర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
సెప్టెంబర్ 15న తిరిగి సమావేశం నిర్వహిస్తామని, బాధ్యతగా పనిచేసే వారియర్లకు గుర్తింపు కార్డులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా వారియర్లు పాల్గొన్నారు.