Telangana Minister Talasani | తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక తారక రామారావును ఎప్పటికీ మరువలేనని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం అమీర్ పేట డివిజన్ లోని ఎస్సా నగర్ కమ్మ వారి సేవా సమితి ఆద్వర్యంలో నిర్వహించిన కార్తీక వన బోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు అమీర్ పేట లోని సత్యం దియేటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి తలసాని స్పందిస్తూ తప్పకుండా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఈనాడు అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరి కాదన్నారు. వన బోజనాల సందర్బంగా అందరూ ఒక దగ్గర చేరి సంతోషంగా గడపటం పట్ల మంత్రి నిర్వహకులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ నామన శేషుకుమారి, మధు సూధన్, రమేశ్, కిషోర్, టిల్లు, సాయి, బుచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.