హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : వట్టినాగులపల్లి భూముల విషయం లో తమ కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్‌తోపాటు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పం దించారు. శుక్రవారం సచివాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు చేయడం సహజం. కేసు నమోదు చేయవద్దని నేను చె ప్పగలను. కానీ, అలా చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కేసు నమోదైన తర్వాత తప్పకుండా అధికారులు నిజ నిర్ధారణ చేస్తారు. తప్పుంటే నేనైనా, నా కొడుకైనా శిక్షకు అర్హులమే’ అని చెప్పారు. ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన భూములపైకి దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొనివెళ్లి నిర్మాణాలను కూల్చడంతో కేసు నమోదైంది. సాక్ష్యాధారాలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో దాడి, దౌర్జన్యం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
మార్చినాటికి ఒక లక్ష గృహ ప్రవేశాలు
ప్రస్తుతం 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, మార్చినాటికి లక్ష గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జీ+3 పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తామని, త్వరలో ప్రణాళికలు వెల్లడిస్తామని చెప్పారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ+3, జీ+4 పద్ధతిలో ఇందిర మ్మ ఇండ్లు నిర్మించేలా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించనున్నట్టు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తొలగించి హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
లీజుపై కొనసాగుతున్న, కబ్జా అయిన హౌసింగ్ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇప్పటికే వెయ్యి ఎకరాల భూమికి ప్రహరీలు నిర్మించిందని వివరించారు. గృహజ్యోతి పథకంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో స్థలాలు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించే అంశాన్ని క్యాబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
తాళాలు వేసి ఉంటే ఇతరులకు ఇండ్లు
కొల్లూరు సహా నగరంలోని ఐదారుచోట్ల నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను లబ్ధిదారులు స్వాధీనం చేసుకోకుండా తాళాలు వేసి ఉంచారని, అలాంటివారికి నోటీసులు జారీచేస్తామని తెలిపారు. వాటిని ఇతర లబ్ధిదారులకు కేటాయిస్తామని వెల్లడించారు.