రామచంద్రాపురం, అక్టోబర్ 19: సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంతో బాగున్నాయని కేంద్ర హౌసింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ కుల్దీప్నారాయణ్ ప్రశంసించారు. శనివారం ఆయన కొల్లూర్-1, కొల్లూర్-2 కేసీఆర్ నగర్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సమూదాయాలను పరిశీలించారు. ఆయా నమూదాయాల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్లు, లిఫ్ట్‌లు, వాటర్ సంప్‌లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లు తదితర వసతులను పరిశీలించి ప్రాజెక్ట్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎలా ఉన్నాయి? ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అని అడిగారు. లబ్ధిదారులు చాలా సంతోషంగా డబుల్ బెడ్రూం ఇండ్లు బాగున్నాయని చెప్పారు. ప్రతినెలా కిరాయి కట్టే పరిస్థితి లేదని, సొంతింట్లో సగౌరవంగా బతుకుతున్నామని సమాధానమిచ్చారు. వాటర్, కరెంట్ అన్ని వసతులను ఏర్పాటు చేశారని, తమకంటూ సొంతింటిని కేసీఆర్ సార్ ఇచ్చారని కొనియాడారు. కొల్లూర్ డబుల్ ఇండ్లను ప్రత్యక్షంగా చూసిన కుల్దీప్నారాయణ్ సైతం సంతోషంగా వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్ చాలా బాగున్నదని అభినందించారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఉన్న హౌసింగ్ స్కీమ్‌లపై అధ్యయనం చేసేందుకు ఆయన పర్యటిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుంచి రూపాయి తీసుకోకుండా అద్భుతమైన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్ నిర్మించి పేదల సొంతింటి కలను నెరవేర్చడం చూసి సంబురపడ్డారు. ఆయన వెంట రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీడీఎంఏ, వీపీ గౌతమ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్‌నాయుడు ఉన్నారు.