హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా వేరియంట్లు సహా సార్స్ తదితర వైరస్లను అంతమొందించే పరికరాన్ని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి అభివృద్ధి చేశారు. ‘ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్’ అనే పేరున్న ఈ పరికరాన్ని శనివారం ప్రగతిభవన్లో ఐటీ మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించి, మాట్లాడారు. నర్సింహాచారి ఆవిష్కరణ అద్భుతమని అభినందించారు. గతంలో చారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపికయ్యారని వెల్లడించారు. ఇన్స్టాషీల్డ్ పరికరం అందరికీ ఉపయోగపడుతుందని, పరికరం తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చారి మాట్లాడుతూ.. కరోనా మూలాలను తెలుసుకొని, వాటిపై ప్రయోగాలు చేశాక.. రెండేండ్లు శ్రమించి ఇన్స్టాషీల్డ్ను రూపొందించానని తెలిపారు. నెగెటివ్ ఎలక్ట్రాన్ల సాయంతో ఈ పరికరం పనిచేస్తుందని, నిర్దిష్టమైన వేవ్లెంత్ ఎలక్ట్రాన్లు ఇంటి గోడల మధ్య నుంచి కూడా బయటకు దూసుకుపోయి వెలుపల వున్న వైరస్లను చంపేందుకు దోహదపడతాయని అన్నారు. కొన్ని ట్రిలియన్ల నెగెటివ్ ఎలక్ట్రాన్లను వెదజల్లి వైరస్ల భరతం పడుతుందని చెప్పారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీన్ని ధ్రువీకరించాయని వెల్లడించారు. దీనితో దుష్ప్రభావాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని, 3.6 వాట్ల కరెంటును మాత్రమే తీసుకొంటుందని పేర్కొన్నారు.