సినిమా పేరు: లెనిన్
తారాగణం: అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, ఈశ్వరీరావు, రాంకీ, శివాజీ, సునీల్..
దర్శకత్వం : మురళీకిశోర్ అబ్బూరి
సంగీతం: తమన్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
టైటిల్ ప్రకటించిన నాటి నుంచీ అఖిల్ ‘లెనిన్’ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అఖిల్ రగ్గడ్ గెటప్, కథా నేపథ్యం, ప్రచార చిత్రాలు, విడుదలైన పాటలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు కావడంతో కచ్ఛితంగా సినిమా బావుంటుందని ఆడియన్స్ ఫిక్సయిపోయారు. అఖిల్ కెరీర్లో ‘లెనిన్’కి వచ్చినంత హైప్ మరే సినిమాకూ రాలేదన్నది నిజం. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘లెనిన్’గా అఖిల్ థియేటర్లలోకి అడుగపెట్టాడు. మరి అందరి అంచనాలనూ ‘లెనిన్’ నిజం చేశాడా? ఈ సారైనా అఖిల్‌కి సరైన విజయం దక్కిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి..
కథ
అది రాయలసీమలోని రామాపురం అనే గ్రామం. పగలకు, ప్రతీకారాలకు దూరంగా ఉండే గ్రామం అది. రక్తం ఆ నేలను అప్పటివరకూ తాకలేదు. ఆ ఊరిలో సంప్రదాయ జాతర జరుగుతుండగా, ఓ పదేళ్ల పిల్లాడు ఆ ప్రాంతంలోకి అడుపెట్టాడు. అ పిల్లాడి పేరు ‘లెనిన్’. అమ్మానాన్న లేని అనాథ అయిన లెనిన్ని ఆ ఊరి పెద్దావిడ(ఈశ్వరీరావు) అక్కున చేర్చుకుంది. ఆమె కొడుకైన వసంత్(ప్రమోద్ పంజు)తో లెనిన్‌కి బలమైన స్నేహబంధం ఏర్పడింది. వసంత్‌తో పాటు లెనిన్ కూడా ఆ ఇంట్లోనే పెరిగి పెద్దయ్యాడు.. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత లెనిన్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ ఊరిలోకి అడుగుపెట్టి ఆ ఊరి జనాలైన వందమందిని నరికి చంపాడు. చివరకు తన ప్రాణస్నేహితుడైన వసంత్‌ని కూడా అతి దారుణంగా పొడిచి చంపాడు. అసలు లెనిన్ జైలుకి ఎందుకెళ్లాడు? రక్తం రుచే తెలియని ఆ నేలపై రక్తపాతం ఎందుకు సృష్టించాడు? ప్రాణ స్నేహితుడైన వసంత్ ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
విశ్లేషణ
పరువు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం నేపథ్యంలో సాగే కథ ఇది. కథకుడు, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి ఈ కథను నడిపించిన తీరు బావుంది. ఇదొక విభిన్నమైన స్క్రీన్‌ప్లే. ప్రథమార్థం ఇదేదో పరువు కోసం ప్రాణాలు తీసే వ్యక్తుల చుట్టూ తిరిగే కథగానే అంతా భావిస్తారు. కానీ సెకండాఫ్‌లో ఈర్ష్యా, ద్వేషం, నమ్మకద్రోహం కోణాలు కథలో బహిర్గతమవుతాయి. ఈర్ష్యా, ద్వేషం అనేవి పవిత్రమైన స్నేహాన్ని సైతం నిర్వీర్యం చేస్తాయని ఈ కథ ద్వారా మురళీకిశోర్ అబ్బూరి తెలిపారు. అనాధగా ఆ ఊరు వచ్చిన లెనిన్ ‘నా’ అనుకున్న వారందర్నీ సంపాదించుకున్నానని భ్రమ పడతాడు. తాను ఎప్పటికీ అనాథనేనని తెలుసుకుకోవడంతో కథ ముగుస్తుంది. స్నేహానికీ, ప్రేమకీ లొంగిపోయే లెనిన్ నమ్మకద్రోహానికి బలైపోయాడు. అదే ఈ సినిమా కథ. చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. క్షణక్షణానికి మారుతున్న వ్యక్తులు మనస్తత్వాలను ఈ సినిమాలో చూడొచ్చు. మంచి వాళ్లుగా కనిపిస్తున్న మేకవన్నె పులుల మధ్య జీవితాన్ని సాగించి, సర్వం కోల్పోయిన లెనిన్ని ఈ సినిమాలో చూడొచ్చు. ప్రథమార్ధం చివరి ఇరవై నిమిషాల్లో సినిమాలోని అసలు కథ మొదలైంది. కథలోకి వెళ్లడం ఆలస్యం కావడం వల్ల కథనం నిదానించినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధం ఆద్యంతం ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగింది. మొత్తంగా దర్శకుడు మురళీకిశోర్ వైవిధ్యమైన కథనంతో ఈ కథను నడిపించి సినిమాను నిలబెట్టారు.
నటీనటులు
ఇక ‘లెనిన్’గా కొత్త అఖిల్‌ని ఈ సినిమాలో చూస్తారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తూ, ‘లెనిన్’ ఒకెతు. అమాయకత్వం, మంచి తనం, మూర్ఖత్వం కలగలిసిన ఈ పాత్రలో అఖిల్ జీవించాడనే చెప్పాలి. అతనిలోని పరిపూర్ణమైన నటుడ్ని ‘లెనిన్’లో చూడొచ్చు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అఖిల్ అద్భుతంగా నటించాడు. అతని కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా ‘లెనిన్’ని చెప్పొచ్చు. ఇక భాగ్యశ్రీబోర్సే తనదైన అందచందాలతోపాటు చక్కటి అభినయంతో కూడా ఆకట్టుకున్నది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వసంత్‌గా నటించిన ప్రమోద్ పంజు గురించి. తనది ఇందులో మేకవన్నె పులి లాంటిపాత్ర. మంచివాడిగా కనిపిస్తూ ఉన్నట్టుండి దుర్మార్గుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే పాత్ర అది. ఆ పాత్రలో తన నిజంగా అదరహో అనిపించాడు. ఈ సినిమాతో అతనికి మంచి పేరు రావడం ఖాయం. ఇక శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ.. ఇలా అంతా పరిధిమేర పాత్రలకు న్యాయంచేశారు.
సాంకేతికంగా
ప్రథమార్ధం కథనం విషయంలో దర్శకుడు మురళీకిశోర్ కాస్తంత జాగ్రత్త పడితే బావుండేది. ద్వితీయార్ధం మాత్రం విసుగు లేకుండా సినిమాను నడిపించాడు. అతని స్క్రీన్‌ప్లే ఈసినిమాకు ప్రధాన బలం. తమన్ నేపథ్య సంగీతం బావుంది. ‘వారెవా..వారెవా..’ సాంగ్ వినడానికి కూడా బావుంది. కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఆర్ట్ కూడా బావుంది. 90ల కాలాన్ని బాగా చూపించారు. మొత్తంగా సాంకేతికంగా కూడా సినిమా బావుంది. మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ‘లెనిన్’ నచ్చుతాడు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు పండుగ చేసుకునేలా సినిమా ఉంది. మరి సాధారణ ప్రేక్షకుడ్ని ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
బలాలు
కథనం, అఖిల్ నటన, తమన్ నేపథ్య సంగీతం
బలహీనతలు
ప్రథమార్ధం స్లో అవ్వడం, రక్తపాతం మరీ ఎక్కువ కావడం..
రేటింగ్ : 3/5