– వానాకాలం వచ్చిందంటే కాలనీ పరిసర ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరద
– పూడికతీత పేరుతో ఏటా లక్షల ప్రజాధనం వృథా
– పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన మార్పు శూన్యం
– శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్న స్థానికులు
ఖమ్మం రూరల్, జూలై 10 : గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినా వరద కాలువలు, మురుగు కాల్వల రక్షణ, పరిశుభ్రతకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం చెరువు నుండి వచ్చే వరద కాల్వ దశాబ్దాలుగా కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అయితే రాను రాను ఈ కాల్వ ఆక్రమణలకు గురికావడంతో ఇరుకుగా మారి ఇబ్బందులకు నిలయంగా మారుతుంది. ప్రస్తుతం ఏదులాపురం పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా ఏదులాపురం చెరువు వద్ద కాల్వ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వానాకాలం వచ్చిందంటే చాలు కాల్వ పొంగడం, నివాస ప్రాంతాలను చుట్టుముట్టడం పరిపాటిగా మారింది. అయితే ఇదే సమయంలో ఈ కాల్వ కొందరికి కాసులు సైతం కురిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు మేజర్ కాల్వ ఇప్పుడు పిల్ల కాల్వగా మారడం కండ్ల ముందు కనపడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం అటువైపుగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వరద కాల్వలో మురికి కృపాన్ని తొలగించేందుకు ప్రతి ఏటా లక్షలాది రూపాయలను ఖర్చుపెట్టి అరకొరా పనులు చేయిస్తున్నారు. దీంతో గుత్తేదారుల జేబులు నిండుతున్నాయి తప్ప సమీప కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఆక్రమణలు మరోవైపు, గుత్తేదారులకు వరప్రసాదంగా మారినా ఏదులాపురం అలుగు కాల్వకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుకుంటున్నారు. తద్వారా ఏటా ప్రజాధనం వృథా కాకుండా చూడటంతో పాటు, సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని స్థానికులు భావిస్తున్నారు, మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపెడతారని ఆశిద్దాం.

గుత్తేదారులకు, ఆక్రమణదారులకు కల్పవృక్షంగా ఏదులాపురం అలుగు కాల్వ