హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో రాష్ట్ర విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు.
2014కు ముందు తెలంగాణ ఎట్లున్నదో, ఇప్పుడెట్లున్నదో ఆలోచించాలని ప్రజలు ఆలోచించాలని మంత్రి కోరారు. గత తొమ్మదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఊరూరా చర్చ చేపట్టాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ఫేక్ న్యూస్‌తో బీజేపీ సోషల్ మీడియాలో ఊదరగొడుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారానే బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యార్థులంతా అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీలు దిగి ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. 33 మెడికల్ కాలేజీల దగ్గర సెల్ఫీలు దిగి డీపీలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో 1,001 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. గురుకుల విద్యార్థులతో రీల్స్ చేసి ఇన్‌స్టాలో పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి దగ్గర నల్లా పక్కన నిలబడి సెల్ఫీలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నర్సీరీ ఉన్న ఏకైక రాష్ట్రం మనదని మంత్రి చెప్పారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర నిలబడి ఫొటోలు దిగి ప్రచారం చేయాలని కోరారు.