కామారెడ్డి: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన తర్వాత కామారెడ్డిలో ఘననీయంగా అభివృద్ధి జరుగుతుందని, అప్పుడు ఇక్కడి భూముల ధరలు అమాంతం 20 నుంచి 30 రెట్లు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఏ ఒక్కరూ గుంట భూమి ఉన్నా అమ్ముకోవద్దని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో పార్టీ శ్రేణులతో జరిగిన సభలో కార్యకర్తలు, నేతలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఇంకా మంత్రి ఏమన్నారంటే.. ‘సీఎం నియోజకవర్గం అయితే ఒక్క కామారెడ్డిలో మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దాకా భూముల విలువ పెరుగుతది. కామారెడ్డి చుట్టూ ఉన్న ఐదారు నియోజకవర్గాల దశ తిరుగుతది. కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నదే అందుకు. ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు. అంతేగాని ఆయనకు మరో ఉద్దేశం లేదు. కానీ, కేసీఆర్ కామారెడ్డికి వస్తే భూములు గుంజుకంటడని ఒకడంటున్నడు. వాడు దివానా గాడా..? మంచోడా..? అర్థం కావడం లేదు. కేసీఆర్ భూములు గుంజుకుంటడా..? ప్రజల భూములు గుంజుకోవాల్సిన ఖర్మ ఆయనకేం పట్టింది..? దోమకొండ మండలం పోసాన్పల్లిలో మా నాయనమ్మ వాళ్లకు ఆనాడే 100ల ఎకరాల భూమి ఉండె. ఆయన భూములు ఎందుకు గుంజుకుంటడు..? ఆ మాట అనేటోనికి ఏమన్నా బుద్ధి ఉన్నదా..? నేను ఒక్కటే మాట చెప్తున్నా. కేసీఆర్ ఇక్కడికి వస్తే మీకు ఏ అభివృద్ధి పని కావాలన్నా వేగంగా జరుగుతది. సీఎం చేత మీ పనులు చేయించే బాధ్యత నేను, గంప గోవర్ధన్ అన్న తీసుకుంటం’ అని హామీ ఇచ్చారు.
సీఎం నియోజకవర్గం అయితే కామారెడ్డి దశ తిరుగుతది
‘గజ్వేల్‌లో కేసీఆర్ గత రెండు పర్యాయాల నుంచి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేస్తున్నరు. ఆ ఏరియా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆ అథారిటీకి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన ముత్యంరెడ్డి అనే అధికారిని డెవలప్మెంట్ అధికారిగా పెట్టినం. ఆయన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేరుగా సీఎంతో, సీఎస్‌తో ఇతర అధికారులతో మాట్లాడి పరిష్కరించేవారు. కావాలంటే ఆ అధికారినే మీ నియోజవర్గ డెవలప్మెంట్ అథారిటీకి అధికారిగా పెట్టుకుందాం. ఆయన, నేను, గోవర్ధన్ అన్న కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా చేయిస్తం. ఒక్కసారి కామారెడ్డి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయితే మీకు ఇన్ని సౌలత్లు ఉంటయ్. రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా కామారెడ్డి మారుతుంది’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఓట్ల కోసం స్వాతిముత్యం కమల్‌హాసన్‌లా పట్టుబట్టాలి
‘గంప గోవర్ధనన్న హయాంలో కామారెడ్డి జిల్లా కేంద్రం అయ్యింది. పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగనయ్. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నం. ఈ నెల 9న కామారెడ్డిలో జరిగే కేసీఆర్ బహిరంగసభకు ప్రతి వార్డు నుంచి 1000 మందికి తగ్గకుండా ప్రజలు వచ్చి జయప్రదం చేసేలా మీరు కృషి చేయాలి. సీఎం మీటింగ్‌ను జయప్రదం చేయాలని పట్టణంలోని ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని కోరాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలను వారికి గుర్తుచేసి ఓట్లడగాలి. స్వాతిముత్యంలో కమల్‌హాసన్ ఉద్యోగం కోసం సోమయాజులు వెంటపడ్డట్టు.. మీరంతా ఓట్ల కోసం ప్రజల వెంట పడాలి’ అని మంత్రి సూచించారు.
మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేరుస్తాం
‘మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలోని ప్రతి వ్యక్తికి కేసీఆర్ బీమా సౌకర్యం కల్పించబోతున్నాం. పద్దెనిమిదేళ్లు పైబడిన అర్హురాలైన ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 భృతి చెల్లించనున్నాం. ఇవన్నీ మ్యానిఫెస్టోలో చేర్చాం. గతంలో మ్యానిఫెస్టోలో చేర్చని పనులు కూడా చేశాం. ఇప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం. ఎమ్మెల్యే గోవర్ధన్ అన్నతో కలిసి మీరంతా నియోజకవర్గంలోని వివిధ సంఘాలను కలుపుకుని పోవాలి. అందరి మద్దతు కూడగట్టి కేసీఆర్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలి. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఖాయం. కానీ బంపర్ మెజారిటీతో గెలిచిపించడం ముఖ్యం’ అని మంత్రి చెప్పారు.