పాలకుర్తి: నియోజకవర్గంలో తనపై పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం రాగన్న గూడెం, గణేష్ కుంట, జేతురాం తండా, జింకురాం తండా, కేశవపురం, కొలన్ పల్లె, పోతిరెడ్డి పల్లె తదితర గ్రామాల్లో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గిరిజన మహిళలతో కలిసి దాండియా పాటలకు నృత్యాలు చేసి అలరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను పాలకుర్తిలో లక్ష మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తనపై గెలిచే దమ్ము లేక విదేశాల నుంచి అరువుకు తెచ్చుకొని, డబ్బులున్న వాళ్ళని పోటీకి నిలిపారని ఎద్దేవా చేశారు. నాపై పోటీ చేయాలని కాంగ్రెస్లో ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ అభ్యర్థులే లేరా..? అని ప్రశ్నించారు. స్థానికంగా ప్రజలకు సేవచేసే నాయకులను కాదని ఎన్నారైలకు ఓట్లు వేసే ప్రజలు పాలకుర్తిలో లేరన్నారు.