Damodar Raja Narsimha | రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధి లో నివసించే చెంచులకు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య భవన్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మున్ననూరు లతో పాటు ఇతర జిల్లాలలో ఉన్న గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన విషయమై మంత్రి దామోదర్ రాజ నర్సింహా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో చెంచులు, గిరిజనులకు వైద్య వసతుల కల్పనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల అధికారులకు మంత్రి రాజ నర్సింహా దిశానిర్దేశం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి చెంచు పెంట, గిరిజన గూడెంలో నివసించే ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. భౌగోళికంగా ఐటీడీఏ పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో అరగంట లోపే వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులకు చేరుకునేలా కార్యాచరణను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు భౌగోళికంగా నెట్వర్క్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని దామోదర్ రాజ నర్సింహా చెప్పారు. అవసరమైన చోటా కొత్తగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలోని ఆసుపత్రులలో సిబ్బంది, డాక్టర్లు మందులు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలంలో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) కంటే వారం ముందు గర్భిణీలను ఆసుపత్రికి తరలించి వారిని బర్త్ వెయిటింగ్ రూమ్ లలో ఉంచేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజ నర్సింహా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలలో స్థానిక గిరిజన భాష తెలిసిన సిబ్బందిని నియమించాలన్నారు. తద్వారా వారి సమస్యలను విని పరిష్కరించేందుకు దోహదపడుతుందన్నారు. అటవీ ప్రాంతంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్స్ ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఐటీడీఏ ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల నివారణ పై మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి గిరిజన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల సీజన్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్ష లో గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోoగ్తూ, ఫ్యామిలీ హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవ్ రావు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు డా. రవీంద్రా నాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.