హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో నిర్మాణ రంగంలో తెలంగాణ అద్బుత ప్రగతి సాధించిందని ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ తాజా మాజీ అధ్యక్షుడు ప్రదీప్మిట్టల్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రోడ్లు, భవనాలశాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ గణపతిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ స్టేట్ చాప్టర్ సమావేశానికి ప్రదీప్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన 50 మంది ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రతినిధులతో ప్రదీప్ మిట్టల్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు నిర్మించడాన్ని అభినందించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్మించడం వల్ల సామాన్య ప్రజలకు సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు, సామాన్య ప్రజలు క్యాంపు కార్యాలయాలకు వెళ్లి ఎమ్మెల్యేలను కలిసేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారులను ఒకే చోట కలిసేందుకు వీలుగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను అద్భుతంగా నిర్మించారని ప్రదీప్మిట్టల్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇంజినీర్లను అభినందించారు. అలాగే, హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఒక్క పోలీస్ శాఖకే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాలతో పాటు ఇతరశాఖలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా నిర్మించడాన్ని ప్రదీప్ మిట్టల్ అభినందించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఈఎన్సీ గణపతిరెడ్డి మాట్లాడుతూ, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం ఏర్పడే నాటికి 30 లక్షల చదరపుటడుగుల భవనాలు మాత్రమే ఉండగా, ఈ ఎనిమిదేళ్లలో 120 లక్షల చదరపుటడుగులకు భవనాలు పెంచామన్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు నిర్మించామని, జిల్లాల పునర్విభజన తర్వాత అన్ని జిల్లాలకు సమీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించామన్నారు. అలాగే, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, తెలంగాణ సచివాలయం, అమరుల స్మృతి వనం నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు, సూపర్‌స్పెషాలిటీ దవాఖానలు, నూతన మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాలు చేపట్టామని గణపతిరెడ్డి తెలిపారు.