Corning Inc | హైదరాబాద్, జనవరి 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న..’ చందంగా ఉన్నది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్‌ను విడిచిపెట్టి తమిళనాడుకు తరలిపోతున్నదని 43 రోజుల కిందటే ‘నమస్తే తెలంగాణ’ బ్యానర్ వార్తగా ప్రచురించింది. అప్పుడు మేల్కొనని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంతో సదరు కంపెనీ ఎంవోయూ కుదుర్చుకొన్న తర్వాత ఆగమాగం అవుతున్నది. కంపెనీని తిరిగి వెనక్కి రప్పించడానికి ఆపసోపాలు పడుతున్నది. దేశంలో తొలిసారిగా గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు గత 7-8 నెలలు తీవ్ర కసరత్తు చేశారు. అప్పటి కేసీఆర్ సర్కారు చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహకాలు వారిని ఆకర్షించాయి. దీంతో తెలంగాణను తమ ఉత్పత్తి ప్లాంట్‌కు కేంద్రంగా ఎంచుకోవాలనుకొన్నారు.
రూ.934 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గత సెప్టెంబర్‌లో నిర్ణయించారు. హైదరాబాద్‌లో కార్నింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్ కూడా పేర్కొన్నారు. అయితే, నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే, ఫలితాలు విడుదలై 15 రోజులు కాకుండానే.. కార్నింగ్ ప్లాంట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిపోతున్నదంటూ జాతీయ పత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’లో ఓ కథనం ప్రత్యక్షమైంది. దీంతో నిజానిజాలు తెలుసుకోవడానికి ‘నమస్తే తెలంగాణ’ బృందం అటు పత్రిక ప్రతినిధులతో పాటు కార్నింగ్ కంపెనీని కూడా సంప్రదించింది. తరలింపు మాట నిజమేనని ఇరువర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ.. డిసెంబర్ 13, 2023న (బుధవారం) ‘హైదరాబాద్‌కు కార్నింగ్ గుడ్‌బై’ పేరిట నమస్తే తెలంగాణ బ్యానర్ వార్తను ప్రచురించింది. అయితే, కంపెనీ తరలింపును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
తెలంగాణ నుంచి ప్లాంట్‌ను తరలించడానికి నిర్ణయించుకొన్న కార్నింగ్.. తమిళనాడులో రూ.1,003 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తమిళనాడు సర్కారుతో ఎంవోయూ కుదుర్చుకొన్నది. చెన్నై సమీపంలోని కాంచీపూరం జిల్లాలో ఉన్న పిల్లాయిపక్కమ్లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. ప్లాంట్ ఏర్పాటుతో 840 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, కొందరు ప్రభుత్వాధికారులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. కాగా, కంపెనీ తరలింపు వార్తలు వెలుగుచూసినప్పుడే, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపడితే, ఈ పరిస్థితి వచ్చేదికాదని పలువురు విమర్శిస్తున్నారు. సర్కారు ఉదాసీన వైఖరి కారణంగానే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దూరమయ్యాయని, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు చేజారిపోయిందని మండిపడుతున్నారు.