హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): శ్రీపోతులూరి వీరబ్రహ్మం రిజర్వాయర్ (ఎస్పీవీబీఆర్) ఎడమ కాలువ నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఆంధ్రప్రదేశ్ సర్కారు టెండర్లు ఆహ్వానించిందని, దీనిని వెంటనే నిలువరించాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 292 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని ఇటుగులపాడు, సావిసెట్టిపల్లి, కొండ్రాజుపల్లి, వరికుంట్ల, గంగానపల్లితోపాటు కడప జిల్లా కాసినాయన మండలంలోని గ్రామాల చెరువులను నింపేందుకు వినియోగించాలని నిర్ణయించారని తెలిపారు.
ఈ నిర్ణయం ఏపీ పునర్విభజన చట్టం-2014కు విరుద్ధమని వెల్లడించారు. దీనివల్ల తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, శ్రీశైలం దిగువ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, కేఆర్ఎంబీ పరిధిలోని రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) నాలుగో సమావేశాన్ని ఆగస్టు 4వ తేదీన జలసౌధలో నిర్వహించనున్నట్టు కేఆర్ఎంబీ సూపరింటెండెంట్ ఇంజినీర్ తెలిపారు. పవర్‌హౌస్ ఆపరేషన్స్, నిబంధనల్లో సవరణలు, మిగులు జలాల కేటాయింపు తదితర అంశాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.