హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు న్యాయవాదులతోపాటు దేశవ్యాప్తంగా 105 మంది లాయర్లకు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులుగా పదోన్నతి లభించింది. వీరిలో తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది పీ నిరూప్, ఏపీకి చెందిన అన్నం డీఎన్ రావు, యడవల్లి ప్రభాకర్‌రావు ఉన్నారు. వీరితోపాటు హైకోర్టు న్యాయమూర్తులుగా రిటైరైన జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి (వరంగల్), జస్టిస్ నౌషద్ అలీ (ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు)కి కూడా సీనియర్ హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీసుకొన్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టుతోపాటు వివిధ రాష్ర్టాల హైకోర్టుల్లో గత 30 ఏండ్లుగా ఎన్నో కేసులను వాదించిన నిరూప్.. ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, దివంగత పీ రామచంద్రారెడ్డి కుమారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది హోదా పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. సంగారెడ్డిలోని మెదక్ జిల్లా బార్లో న్యాయవాదిగా తొలి అడుగులు వేసిన రామచంద్రారెడ్డి నుంచి వారసత్వంగా నిరూప్ న్యాయవాద వృత్తిని ఎంచుకొన్నారు. గత 30 ఏండ్ల నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న నిరూప్.. రాజ్యాంగపరమైన కేసులతోపాటు ఇంటర్నేషనల్ లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా, భూములు, వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కీలక కేసులను వాదించారు. వీటిలో 31 కేసుల తీర్పులు రికార్డు (రిపోర్టబుల్) అయ్యాయి. ఉమ్మడి ఏపీ పూర్వ అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సీనియర్ న్యాయవాది వీఆర్ రెడ్డి, పూర్వపు సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యం దగ్గర నిరూప్ ప్రాక్టీస్ చేశారు. 2013-2018 మధ్యకాలంలో గోవా, ఢిల్లీ రాష్ర్టాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనవంతు పాత్ర పోషించారు. ఆయనకు పదోన్నతి లభించడంపై న్యాయ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.