JPS | హైదరాబాద్/తొర్రూరు, మే 13 (నమస్తే తెలంగాణ): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) శనివారం విరమించారు. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై విశ్వాసంతోనే సమ్మె విరమిస్తున్నట్టు తెలంగాణ జేపీఎస్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్ట శ్రీకాంత్‌గౌడ్ వెల్లడించారు. శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వివిధ జిల్లాల బాధ్యులతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.
ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెంట రఘు, జనార్దన్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు పరమేశ్వర్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం రవికుమార్, తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆరెల్లి దేవయ్య, వేద రాజేశ్వర్, గంట సాత్విక్‌తోపాటు పలువురు పంచాయతీ కార్యదర్శులు కలిసి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సోమవారం నుంచి విధులకు హాజరవుతామని తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పలువురు జేపీఎస్‌లు శనివారమే విధుల్లో చేరారు.