హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ 714ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16, 17న రాష్ట్రవ్యాప్తంగా రవాణా బంద్కు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం ఉప్పల్లోని టీఆర్ఎస్కేవీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య బంద్కు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించి, మాట్లాడారు.
రోడ్ సేఫ్టీ బిల్లు 2019ని రద్దు చేయడంతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సులో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతామని చెప్పారు. ఫిట్నెస్ రెన్యూవల్ ఆలస్య రుసుం పేరుతో రోజుకు రూ.50 పెనాల్టీ విధించడం కార్మికుల బతుకులతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా బంద్కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాండునాయక్, హైమద్, పొలేని రంజన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.