Telangana Minister Sridhar Babu | వచ్చే పదేండ్లల్లో తెలంగాణాను ట్రిలియన్ డాలర్ల (రూ.84 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కృత్రిమ మేథ, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లు చోదక శక్తులుగా ఈ అసాధారణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. కృత్రిమ మేథలో దిగ్గజ సంస్థ ‘ఫెనామ్’ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన ‘ఐయామ్ ఫెనామ్ ఇండియా’ సదస్సు ముగింపు సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్తు అవసరాలకు సరిపడా నిపుణులైన మానవ వనరులను అందిస్తామని ఆయన తెలిపారు.
ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం ద్వారా యువతలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీయడంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫెనామ్ లాంటి యూనికార్న్ సంస్థలు సహాయ పడాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులు సృష్టించడంలో ఉన్న అవకాశాలపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హెచ్ ఆర్ నిపుణులు, చీఫ్ ఎక్స్ పీరియన్స్ అధికారులు, ఆవిష్కర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఒలింపియన్ అభినవ్ బింధ్రా, ఫెనామ్ అధ్యక్షుడు, సహ వ్యవస్థాపకుడు హరి బైరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ, ఐటీ స్ట్రాటర్జిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.