హైదరాబాద్ : దేశంలో పరిపాలన అధ్వాన్నంగా ఉన్నదని, ఇతర దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం పాలకుల వైఫల్యంవల్ల అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అణుబాంబు విస్ఫోటనంలో అన్నీ కోల్పోయిన జపాన్ బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా అభివృద్ధిలో ఆకాశాన్నందుకున్నదని చెప్పారు. ఆటో మొబైల్ మొదలుకొని అనేక సాంకేతిక పరికరాల ఉత్పత్తిలో నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. కనీసం మంచి నీళ్లు కూడా లేని సింగపూర్ ప్రపంచం నివ్వెరపోయేలా అభివృద్ధి చెందిందని చెప్పారు.
అదేవిధంగా దక్షిణ కొరియా, మలేషియా తదితర దేశాల విజయగాథలెన్నో మన కళ్లముందే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆ విజయ గాథల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయని, తీసుకోవాల్సిన స్ఫూర్తీ ఉన్నదని చెప్పారు. కానీ మన దేశ పాలకులకు అదేం పట్టదని, మూస పద్ధతిలో గుడ్డెద్దు చేలో పడ్డట్టు దేశ పరిపాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఈ మూసను బద్దలు కొడుతూ నవీన దృక్పథంతో, నూతన చేతనతో దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే లక్ష్యాన్ని స్వీకరించిందని చెప్పారు.
పార్టీల గెలుపే గెలుపు కాకూడదని, అది ప్రజల గెలుపు కావాలని బీఆర్ఎస్ నమ్ముతున్నదని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కేవలం ఎన్నికల కోసమో, అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదని, భారతదేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారు. ఈ దిశగా ప్రజల ఆలోచనా సరళిలోనూ, వారి జీవితాల్లోనూ గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ అప్రతిహతంగా పురోగమించాలని ఈ సభ తీర్మానిస్తున్నదన్నారు.