హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కాలేజీలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. 158 కాలేజీలతో దేశంలోనే మన రాష్ట్రం ఆరోస్థానంలో నిలిచింది. విస్తీర్ణం, జనాభాపరంగా మనకన్నా పెద్దవైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ వంటి రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలోనే ఈ కాలేజీలు అధికంగా ఉండటం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (బీఎంఎస్) కోర్సుల నిర్వహణకు 2024-25 విద్యా సంవత్సరంలో జాతీయంగా 3,271 కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది. ఇది వరకు ఆయా రాష్ర్టాల్లోని వర్సిటీలే పైకోర్సులకు అనుమతులు ఇచ్చేది. తొలిసారిగా ఈ అనుమతులు ఏఐసీటీఈ గొడుగు కిందికి చేరాయి.
బీసీఏ, బీబీఏ, బీహెచ్ఎం కోర్సులకు జాతీయంగా అనుమతులు ఇస్తుండటంతో ఏఐసీటీఈ ఏకీకృత కరికులాన్ని రూపొందించింది. బీటెక్ తరహాలో వివిధ సంస్థలు, పరిశ్రమల నిపుణులను సంప్రదించి, మాడల్ పాఠ్యాంశాలను రూపొందించారు. వారంరోజుల్లోగా ఈ కరిక్యులాన్ని విడుదల చేస్తారు. అందరి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేస్తారు. దీంతోపాటు ఈ కోర్సులు బోధించే లెక్చరర్లు, ఆచార్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీటీఈ సన్నాహాలు చేస్తున్నది. కొత్తగా విడుదల చేయనున్న కామన్ కరికులంపై వారికి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకురావడంతో బీసీఏ ఉత్తీర్ణులైన వారికి ఎంసీఏ, బీబీఏ వారికి ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులు మన దగ్గర నిర్వహించే ఐసెట్ వంటి ప్రవేశపరీక్షలతో నిమిత్తం లేకుండా నేరుగా ఈ కోర్సుల్లో చేరే వెసులుబాటు దక్కుతుంది.