హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో మాంసాహార వినియోగంలో పరిమాణం పరంగా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎంఎంఆర్ఐ) సర్వే స్పష్టంచేసింది. తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు 2 కేజీల మాంసం తింటున్నట్టు వెల్లడించింది. అలాగే తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ ఏడో స్థానంలో ఉందని జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే నివేదిక తెలిపింది. అత్యధికంగా నాగాలాండ్‌లో ప్రజలు నాన్‌వెజ్ తింటున్నట్టు వెల్లడించింది. అక్కడ జనాభాలో 99.8శాతం మంది మాంసాహారం తింటున్నట్టు పేర్కొంది. ఒక్కోరాష్ట్రంలో ఒక్కోరకమైన మాంసాహారం ఎక్కువగా తింటున్నట్టు తెలిపింది. నాగాలాండ్, బెంగాల్లో ప్రజలు చేపలు, తెలంగాణ, ఏపీ, తమిళనాడులో చికెన్, మటన్‌తో పాటు చేపలు ఎక్కువగా తింటారని వెల్లడించింది. అలాగే ఒడిశాలో ప్రజలు రొయ్యలను ఇష్టంగా భుజిస్తారని పేర్కొంది. త్రిపురలో ప్రజలు పందిమాంసం ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిపింది. గోవాలో చేపలు, పీతల వంటి సీఫుడ్ వినియోగం ఎక్కువ అని సర్వే స్పష్టంచేసింది.