హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి న స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో అమలవుతున్న వివిధ పథకాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఒక రోల్‌మోడల్‌గా మారిందని అన్నారు. బాలల సమగ్ర అభివృద్ధి కోసం చేపడుతున్న బాలామృతం, గ్రోత్ మానిటరింగ్ స్పెషల్ డ్రైవ్ (పిల్లల పెరుగుదల నమోదు ప్రత్యేక కార్యక్రమం) చాలా బాగున్నాయని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బాలామృతానికి అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉన్నదని, దీని ఉత్పత్తిని మరింత పెంచి ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం కోసం కావాల్సిన సాయాన్ని కేంద్రం అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి చెప్పారు. గ్రోత్ మానిటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణలో అద్భుతంగా నిర్వహిస్తున్నారని, దీనిని దేశవ్యాప్తంగా అమలుచేయడం వల్ల పిల్లల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తెలంగాణకు రావాలని మంత్రి సత్యవతి కోరగా.. స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు.
కేంద్రవాటాను పెంచాలి: మంత్రి సత్యవతి
పిల్లలు బాలింతలు, గర్భిణుల పోషకాహారలోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ్ అభియాన్ గడువు ఈ నెల 30తో ముగుస్తున్నదని, దానిని కొనసాగించాలని రాష్ట్ర మంత్రి సత్యవతి కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు. గతంలో మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను కూడా భరించాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల కోసం చేపట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. పోషకాహారం కార్యక్రమం కింద చిరుధాన్యాల కోటాను పెంచాలని కోరారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద కేంద్ర కోటాను తగ్గించడం వల్ల రాష్ట్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీల కోసం చేపట్టే కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతున్నదని, 2017 నాటికి ఉన్న కేంద్రం కోటాను తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేశారు. అంగన్వాడీల వేతనాల చెల్లింపులో కేంద్ర రాష్ర్టాల వాటా 60:40 శాతం ఉండేదని, దానిని కేంద్రం 25:75కి తగ్గించిందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీల సేవలు కుదించుకుపోయాయని వివరించారు. రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో పరిపాలనా వ్యయం మొత్తాన్ని కేంద్రం నిలిపివేసిందని ఫలితంగా ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సమగ్ర మహిళాభివృద్ధికి విఘాతం కలుగుతున్నదని తెలిపారు. అందువల్ల చెల్లింపులను పునరుద్ధరించాలని ఆమె కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఉన్నారు.