హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్: గ్రామీణాభివృద్ధిలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. శనివారం రంగారెడ్డి జడ్పీ కార్యాలయ ఆవరణలో రెండు చీఫ్ ఇంజినీర్ (టెరిటోరియల్) కార్యాలయాలను, ఉప్పల్‌లో ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని, అందుకే జాతీయ అవార్డులు అధికంగా వచ్చాయని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్ స్థాయిలో నిలిచే విధంగా కృషి చేశారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అవార్డులు దక్కించుకోవడంతోపాటు, ప్రతి అంశంలోనూ తెలంగాణ రాష్ట్రమే రోల్ మాడల్‌గా మారిందని అన్నారు. ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచనతోనే పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, శాఖను మరింత బలోపేతం చేశామని మంత్రి వివరించారు.
కార్యాలయాల విస్తరణ
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 87 కొత్త కార్యాలయాలు, సీఈ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ అధికారులు శనివారం బాధ్యతలు స్వీకరిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పునర్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉన్నాయని, మిషన్ భగీరథతోపాటు, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, 12 కొత్త సర్కిళ్లు, 11 డివిజన్లు, 60 కొత్త సబ్ డివిజన్లు మంజూరు చేశామని వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 74 కొత్త పోస్టులను మంజూరు చేశామని, పదోన్నతులు కల్పించామని చెప్పారు. కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పీఆర్ ఇంజినీరింగ్ ఈఎన్సీ సంజీవరావు, సీఈ సీతారాములు, ఎస్ఈ శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.