Telangana Budget | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను సోమవారం శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా నమోదవుతోంది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా.. 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతం కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తోంది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతం జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది’ అని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉప రంగాల్లోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోందని మంత్రి చెప్పారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగినట్లు చెప్పారు. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధిరేటు నుంచి రెండంకెల వృద్ధిరేటుకు చేరుకుందన్నారు. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమైందని వెల్లడించారు. మరోవైపు ద్వితీయ, తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్తు, రవాణా, హోటళ్లు తదితర సేవారంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా.. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదన్నారు. రాష్ట్రంలో వినియోగంతోపాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమవుతోందని మంత్రి వివరించారు.
‘రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2013-14 సంవత్సరంలో రూ.1,12,162 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2022-23లో రూ.3,17,115 గా ఉండొచ్చని అంచనా. ఇది జాతీయ సగటు అయిన రూ.1,70,620 కంటే 86 శాతం ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం కన్నా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,46,495 ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం’ అని మంత్రి వివరించారు.