e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home Top Slides సర్కారు డాక్టర్లు సల్లగుండ!

సర్కారు డాక్టర్లు సల్లగుండ!

సర్కారు డాక్టర్లు సల్లగుండ!
  • నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స
  • మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు
  • కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది
  • నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు
  • అందుబాటులో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు
  • అందుకే కరోనా నుంచి వేగంగా రికవరీ
  • డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్న బాధితులు
  • నిత్యం సీఎం కేసీఆర్‌ సమీక్షలు, ఆదేశాలు
  • మొన్న గాంధీ సందర్శన.. నేడు ఎంజీఎంకు
  • వైరస్‌ కట్టడిలో దేశంలో నం.1 తెలంగాణ

కరోనా బాధితులు ప్రభుత్వ దవాఖానల్లోనే చేరాలి. ప్రైవేట్‌ హాస్పిటళ్లలో చేరి డబ్బులు వేస్ట్‌ చేసుకోవద్దు. కరోనాకు ఎక్కడైనా ఒకటే చికిత్స.

-కరోనాపై సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌

బర్మావత్‌ గమనిబాయికి 80 ఏండ్లు. కరోనా సోకి బోధన్‌ జిల్లా దవాఖానలో చేరారు. పరిస్థితి తీవ్రమై వెంటిలేటర్లు పెట్టాల్సి వచ్చింది. కానీ.. ప్రభుత్వ వైద్యులు అందించిన చికిత్స, నర్సులు, సిబ్బంది సపర్యలతో కోలుకున్నారు. వైద్యంతోపాటు అందించిన ధైర్యం ఆమెకు కొత్త ఊపిరి పోసింది. సర్కారీ వైద్యానికి దండం పెడుతూ లంబాడ భాషలో ఆమె అన్నమాట.. డాక్టరే మార్‌ భగవాన్‌. అంటే.. డాక్టర్లే దేవుళ్లు!! డబ్భు ఆరేండ్ల వయసున్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సీహెచ్‌ కోటేశ్వరావు (62) ఇలా.. ఎంతోమంది ప్రభుత్వ దవాఖానల్లో కోలుకుని సురక్షితంగా ఇండ్లకు తిరిగి వెళుతున్నారు. తమకు ప్రాణంపోశారంటూ ప్రభుత్వ వైద్యులకు చేతులెత్తి మొక్కుతున్నారు.

హైదరాబాద్‌, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా ధాటికి దేశంలోని అన్ని రాష్ర్టాలు చిగురుటాకులా వణికిపోతుంటే వైరస్‌పై మెరుగైన యుద్ధం చేయడం ద్వారా తెలంగాణ వేగంగా కోలుకుంటున్నది. పరిస్థితిని ముందే ఊహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండో వేవ్‌ రావటానికి ముందే ప్రభుత్వ దవాఖానల్లో వసతులను మెరుగుపర్చారు. కార్పొరేట్‌ హాస్పిటళ్లకు దీటుగా చికిత్స అందించే మౌలిక సదుపాయాలను కల్పించారు. సర్కారీ వైద్యం సల్లగుండ అని పేద ప్రజలు దీవించేలా దవాఖానల రూపురేఖల్ని మార్చేశారు. ఆ ఫలితంగానే కరోనా కట్టడిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచింది. సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పసిగట్టి, గాంధీ దవాఖానను మళ్లీ కొవిడ్‌ దవాఖానగా మార్చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవటం, కరోనా కోసమే ప్రత్యేకంగా కట్టిన టిమ్స్‌లో సౌకర్యాలను మెరుగుపరిచారు.

కార్పొరేట్‌ దవాఖానలను మించి..

ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల పేరు వినగానే ఆ వైపు వెళ్తే ప్రాణాలు ఉంటాయో, ఉండవోనన్న భయం. ఆ భయాన్ని పోగొట్టి ప్రజల్లో సర్కారీ వైద్యంపై భరోసా కల్పించింది టీఆర్‌ఎస్‌ సర్కారు. అన్ని వేళలా ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 24 గంటల పాటు డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచి రోగులకు సేవలు అందిస్తున్నది. రోగనిరోధకశక్తిని పెంచేందుకు పోషకాహారం అందిస్తున్నది. పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇదీ అని చూపించింది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లోనూ మౌలిక వసతులు కల్పించి జిల్లాలవాసులు హైదరాబాద్‌ వరకు వచ్చే అవసరం లేకుండా చేసింది.

ఇంటింటి సర్వే ఓ రికార్డు

దేశచరిత్రలోనే ఇంటింటి సర్వే ఓ రికార్డు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, బీపీ, ఆక్సిజన్‌ స్థాయులను పరీక్షించటం, అవసరమైతే వైద్య సహాయం అందిస్తున్న తీరు శ్లాఘనీయం. ఈ చర్యకు ఫిదా అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లోనూ ఇంటింటి సర్వే చేపట్టాలని తెలిపింది. దీన్నిబట్టే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక, కరోనా రోగుల ఇంటికే వెళ్లి ఐసొలేషన్‌ కిట్‌ అందిస్తుండటం వల్ల ఎంతోమంది కోలుకొని ఆరోగ్యవంతులవుతున్నారు.

వేరే రాష్ర్టాలకు భిన్నంగా..

రోగులకు టెస్టులు చేయటం, నామమాత్రంగా చికిత్స అందించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇలాగే, చేతులు కాల్చుకొన్న రాష్ర్టాలు అనేకం. కానీ, కేసీఆర్‌ సర్కారు కరోనా కట్టడికి పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. ప్రజలకు ఆర్థిక భారం కావొద్దన్న లక్ష్యం ఒకవైపు, అందరి ప్రాణాలు కాపాడుకోవాలన్న మరో లక్ష్యంతో నిరంతరం పర్యవేక్షించింది. చికిత్స తీరును ఎప్పటికప్పుడు తెలుసుకొన్నది. ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా ముందే.. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో ఆక్సిజన్‌ను రాష్ర్టానికి తెప్పించింది. ఇప్పుడు 324 టన్నుల సామర్థ్యంతో 48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నది. బ్లాక్‌ ఫంగస్‌ ప్రమాదం పొంచిఉన్నదని కోఠిలోని ఈఎన్‌టీ దవాఖానను నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లోనే చికిత్స తీసుకొనేందుకు రోగులు ముందుకొస్తున్నారు.

మళ్ల ఇంటికోతననుకోలె..

నేను ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని ఎల్లదీత్తున్న. మాయదారి రోగం ఏడ అంటుకుందో ఏమో.. ఒకటే దమ్ము, దగ్గు వచ్చింది. మా ఊళ్లె ఉన్న ఆర్‌ఎంపీ కాడికి పోతే సీరియస్‌ ఉన్నది పెద్దాసుపత్రికి పొమ్మన్నడు. అసలే పేదోన్ని. ఎక్కడికి పోవాలెనని బతిమిలాడితే సిరిసిల్ల సర్కారు దవాఖానల చేరుమన్నడు. నా బిడ్డ తోలుకొచ్చి చేర్పించింది. 63 ఏండ్లున్న నేను మళ్ల ఇంటికోతననుకోలె. దవాఖాన్ల డాక్టర్లు దేవునోలె చూసుకుండ్రు. మంచి మందులు, టైంకు బువ్వ పెట్టిండ్రు. ఐదు రోజులకే మంచిగ చేసి ఇంటికోమన్నరు.

నారాయణ, జిల్లెల్లపల్లి, గంభీరావుపేట మండలం

ప్రభుత్వ దవాఖానే ప్రాణం పోసింది

76 ఏండ్ల వయసులో కరోనాబారిన పడిన నాకు సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ దవాఖానే ప్రాణం పో సింది. ముందుగానే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవటం కొంత మేలుచేసింది. సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది మంచి సేవలందించారు. వసతులు కూడా చాలా బాగున్నాయి. 1999లో కాంగ్రెస్‌ నుంచి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ, అప్పటి అరకొర అభివృద్ధితో ప్రభుత్వ వైద్యమంటే ప్రజలు ఆమడదూరంలో ఉండేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారటంతో ప్రభుత్వ వైద్యంపై అందరికీ విశ్వాసం పెరిగింది.
దోసపాటి గోపాల్‌, మాజీ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌), సూర్యాపేట

మా నాన్నను కాపాడారు

మా నాన్న సీహెచ్‌ కోటేశ్వర్‌రావు (62)కు ఏప్రిల్‌ 24న కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆక్సిజన్‌ స్థాయులు 60కి పడిపోయాయి. మే 1న నల్లగొండ జిల్లా జనరల్‌ దవాఖానకు తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. 14 రోజులపాటు తీవ్రంగా శ్రమించి మా నాన్నను కాపాడారు. ఇక్కడి డాక్టర్లు దేవుళ్లు.
సంకుజ్‌, పాజిటివ్‌ బాధితుడి కుమారుడు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌

డాక్టరే మార్‌ భగవాన్‌

నాకు 80 ఏండ్లు ఉంటయ్‌. బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించుకొన్నా. పాజిటివ్‌ అని తేలింది. ఆరోగ్యం బాగోలేదని, వెంటిలేషన్‌ పెట్టాలని డాక్టర్లు అన్నరు. ఇప్పుడు మంచిగున్న. డాక్టరే మార్‌ భగవాన్‌ (డాక్టర్లే దేవుళ్లు). సిబ్బంది దగ్గరుండి భోజనం చేయించారు. వాళ్లకు దండాలు.
బర్మావత్‌ గమనిబాయి, రాజీవ్‌నగర్‌ తండా, బోధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్కారు డాక్టర్లు సల్లగుండ!

ట్రెండింగ్‌

Advertisement