హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దృఢత్వంలో స్టీల్‌కు ప్రత్యామ్నాయంగా, మన్నిక, నాణ్యతలో మరే ఇతర మెటీరియల్ సాటిరాని ఫైబర్ గ్లాస్ పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నది. నిర్మాణ రంగంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు అవసరమయ్యే వస్తువులను ఈ మెటీరియల్‌తో ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఏకంగా 54 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా ఎగుమతి కూడా చేయవచ్చని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
ఫైబర్, పాలిమర్స్తోపాటు వివిధ రకాల కెమికల్స్ మిశ్రమాల ద్వారా ఫైబర్గ్లాస్ను తయారు చేస్తారు. కట్టె, స్టీల్, ప్లాస్టిక్ తదితర ఖనిజాల ద్వారా తయారయ్యే వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్‌తో ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తుప్పు, చెదలు పట్టదు. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, రియాక్టర్లు, రైళ్లు, విమానాలకు అవసరమైన వివిధ రకాల వస్తువులు, ఔషధ పరిశ్రమలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలను ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ల ద్వారా తయారు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి తదితర పారిశ్రామికవాడల్లో సుమారు 200 ఫైబర్‌గ్లాస్ పరిశ్రమలు కొనసాగుతుండగా, వీటి ద్వారా నిర్మాణ రంగంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
భారత్‌లో పెరగని వినియోగం
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్స్ వినియోగం చాలా తక్కువ. ప్రజల్లో దీనిపై అంతగా అవగాహన లేకపోవటం వల్ల మార్కెట్లో అంతగా ప్రాచుర్యం లభించలేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో ఫైబర్ గ్లాస్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఖాల్సా గ్రామ పరిధిలో 123 ఎకరాల విస్తీర్ణంలో ఫైబర్ గ్లాస్ కంపోజిట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 54 యూనిట్లకు స్థలాలు కేటాయించగా, ప్రస్తుతం అక్కడ పరిశ్రమల నిర్మాణం కొనసాగుతున్నది. ఈ క్లస్టర్లో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు రాగా, పరిశ్రమల నిర్మాణం పూర్తయితే 30 వేలమందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
ఫైబర్‌గ్లాస్ ఉత్పత్తుల కేంద్రంగా రాష్ట్రం
ఇబ్రహీంపట్నం ఫైబర్‌గ్లాస్ క్లస్టర్లో ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ ఫైబర్ గ్లాస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిశ్రమ కోసం క్లస్టర్‌ను ఏర్పా టు చేయటంతో రానున్న రోజుల్లో మన రాష్ట్రం ఫైబర్‌గ్లాస్ ఉత్పత్తులకు కేంద్రంగా ఎదిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణ రంగంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని రకాల ఉత్పత్తులు తయారవుతాయని వివరించారు.