హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం పేర్కొంది. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని విమర్శించింది. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిర్వహించిన ఆందోళనలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య మాట్లాడారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారని చెప్పారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి ఒక్క రూపాయి రాలేదని విమర్శించారు. కేం ద్రం నుంచి తక్షణమే నిధులు తెస్తారా? లేక రాజీనామా చేస్తారా? అని బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు.
గీత కార్మికుల బకాయిలు చెల్లించాలి ; రాష్ట్ర గీత పనివారల సంఘం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.9 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం 103వ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ధర్మభిక్షం విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని సూచించారు.