Polavaram | హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావం అం శాలపై ఏపీ ఆది నుంచీ మీనమేషాలు లెక్కిస్తున్నది. ముంపుపై సర్వే చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నే, అడుగు కూడా ముందుకేయడం లేదు. సర్వే చే యిస్తామని చెప్పిన కేంద్రజల్శక్తి శాఖ మౌనం వహిస్తున్నది. సీజన్ ముంచుకొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై మొద్దు నిద్రపోతున్నది. జాయింట్ సర్వే చేయించే అంశంపై అటు పీపీఏను, ఇటు కేంద్రాన్ని సంప్రదించిన దాఖలాల్లేకుండా పోయాయి. పోలవరం ప్రాజెక్టుకు ముంపుతోపాటు, అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించింది. సీడబ్ల్యూసీ పలుమార్లు అన్ని రాష్ర్టాలతో సమావేశం నిర్వహించగా, తెలంగాణ బలమైన వాదనలు వినిపించింది.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటిని నిల్వ చేసిన సందర్భంలో 891 ఎకరాలు ముంపున కు గురవుతున్నాయని, మారిన డ్యామ్ డిశ్చార్జి డిజై న్ వల్ల ముంపు పెరిగే అవకాశం ఉందని వాదించింది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతున్నదని, భద్రాచలం వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ వర ద వచ్చిందని తెలిపింది. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కారణంగా నదీ తీరాలు, 31 ఇతర ప్రధాన, మధ్యస్థ వా గుల వెంబడి డ్రైనేజీ రద్దీ సమస్య ఉంటుందని పేర్కొన్నది. ప్రధాన నది వరదల ప్రభావం 60 గ్రామాలపై ఉంటుందని తెలంగాణ ఆది నుంచీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీకి ఆధారాలతో విన్నవించింది. 2018, 2020, ఎన్జీటీ ఆర్డర్లకు అనుగుణంగా జరిపిన అధ్యయనం ఫలితాలను తెలంగాణ ఊటంకించింది. భద్రాచలం వరదలను కూడా ఉదహరించింది. ఎట్టకేలకు తెలంగాణ వాదనలతో కేంద్రం ఏకీభవించడంతో, జాయిం ట్ సర్వే చేపట్టాలని పీపీఏ, ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
జాయింట్ సర్వేకు అనేక కొర్రీలు
పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై ఉమ్మడి సర్వే చేపట్టేందుకు ఏపీ, పీపీఏ ఆది నుంచీ తాత్సారం చేస్తున్నది. ఒకదశలో సర్వే చేసేది లేదని తేల్చి చెప్పాయి. సీడబ్ల్యూసీ జోక్యం చేసుకుని ఏపీని సమన్వయంతో సంయుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అయిష్టంగానే జాయింట్ సర్వేకు పీపీఏ, ఏపీ అంగీకరించాయి. అయినా కొర్రీ లు పెడుతూ జాప్యం చేస్తున్నది. సీడబ్ల్యూసీ మరోసారి ఉమ్మడి సర్వేకు నియమిత కాలపరిమితిని విధి స్తూ పీపీఏకు అల్టీమేటం జారీ చేసింది. తొలుత తెలంగాణ, ఏపీలతో సమావేశం నిర్వహించి, ఉమ్మడి సర్వే ను చేపట్టాలని నొక్కిచెప్పింది. ఏపీ సహకరించకపోయినా సర్వే బాధ్యత పీపీఏదేనని తేల్చిచెప్పి ఏడాది గడిచింది. సీడబ్ల్యూసీ అల్టీమేటంతో పీపీఏ, ఏపీ కొంత హడావుడి చేసి జాయింట్ సర్వేకు ప్రత్యేక అధికార బృందాన్ని నియమించాయి. సర్వేకు తేదీలను తెలియజేయాలని తెలంగాణకు సమాచారం అందించాయి. తీరా సర్వే చేసేందుకు వచ్చిన ఏపీ మళ్లీ పేచీ పెట్టింది. తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం కుదరదని, పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 150 అ డుగల మేరకు నీటినిల్వ వల్ల గతంలో బూర్గుంపాడు వరకు తేల్చిన ముంపు వరకే సర్వే చేస్తామని కొర్రీ పెట్టి సర్వే నిలుపుదల చేసింది. సీడబ్ల్యూసీ సూచన మేరకు సర్వే కుదరదని, ఒకవేళ అదే చేస్తే జాతీయ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని వితండ వాదానికి తెరలేపి సర్వేను అటకెక్కించింది.
చోద్యం చూస్తున్న కేంద్రం
పోలవరం ముంపుపై సర్వేకు ఏపీ ఆది నుంచీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం ఆదేశాల ను అమలు చేయడంలో పీపీఏ కూడాప్రేక్షకపాత్రనే పోషిస్తున్నది. ఇదే విషయమై బీఆర్ఎస్ ప్రభుత్వం పీపీఏకు అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదు. పీపీఏ నిర్లక్ష్యం, ఏపీ కాలయాపన, జాయింట్ సర్వే ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యా దు చేసింది. అయినా కేంద్రం ఎలాంటి చర్య లు తీసుకోకుండా కేవలం లేఖలు రాస్తూ చేతులు దులుపుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంపై దృష్టి సారించిన దాఖలాలు కూడా లేవు. మరోవైపు సీజన్ సమీపిస్తున్నందున ఇప్పటికైనా సర్వేకు ఏపీపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.