హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో పేపర్ లీకేజీలకు ఆస్కారంలేకుండా బోర్డు పటిష్టచర్యలు చేపడుతున్నది. తొలిసారిగా ప్రతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్‌కోడ్, పేపర్ కోడ్ ముద్రిస్తున్నది. ఎవరైనా ప్రశ్నపత్రాలను ఫొటో తీసి పేపర్ లీక్చేసేందుకు ప్రయత్నిస్తే సులభంగా గుర్తించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏ సెంటర్లో, ఏ విద్యార్థి వద్ద నుంచి పేపర్ లీక్ అయ్యిందన్న సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశ్నాపత్రాల ప్రతి పేజీపై క్యూఆర్‌కోడ్, పేపర్ కోడ్‌ను ఇంటర్‌బోర్డు ముద్రించనుంది. పేపర్ కోడ్‌ను వాటర్ మార్క్ రూపంలో ముద్రించారు. అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టులో 10 లక్షల ప్రశ్నపత్రాలను ముద్రిస్తున్నారు. అంటే ఈ 10లక్షల ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ ఉండటంతోపాటు, 10 లక్షల నంబర్లను ముద్రిస్తారు.