హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో అగ్రగామిగా నిలిచేందుకు టీ హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ముగ్గురు శాస్త్రవేత్తలతో జూలై 6న తెలంగాణ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నది. యూకేకు చెందిన గణిత మేధావి సర్ మార్కస్ డు సౌటాయ్, న్యూరో సైంటిస్టు అనిల్ సేథ్, కెన్యాకు చెందిన పాలియో అంత్రపాలజిస్టు లూయిస్ లీకీ ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు.
‘గ్లాడియేటర్స్ ఆఫ్ ది మైండ్’ పేరుతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగం చేయనున్నాయని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. ఆవిష్కరణల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రసిద్ధ శాస్త్రవేత్తలు స్టార్టప్ వ్యవస్థాపకులతో సమావేశమయ్యేలా, వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రోత్సాహాన్ని అందిస్తారని తెలిపారు. ఐటీతోపాటు అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలు చేసేందుకు అనుకూల వాతారణాన్ని (ఎకో సిస్టం) టీహబ్ కల్పిస్తుందని వివరించారు.