బన్సీలాల్‌పేట్, జూన్ 21: హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ హోంగార్డుల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోత్వాల్ దయానంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి సీతక్కను హోంగార్డులు కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సైతం విన్నవించారు.
ఈ సందర్భంగా కోత్వాల్ దయానంద్ మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా పోలీసు శాఖలో విధులను నిర్వహిస్తున్న 16వేల మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత కరువైందని, క్రమబద్ధీకరణ చేయడం లేదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంగార్డుల నియామకాలను చేపడతామని ప్రకటించారని, అందులో వెయింటింగ్‌లో ఉన్న హోంగార్డులకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమను స్పెషల్ పోలీసు అసిస్టెంట్ క్యాడర్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.