హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హోంగార్డులు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డ్స్ రైజింగ్ డే ఘనంగా జరగడంతో తమలో నూతన ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా హోంగార్డుల సంక్షేమం, సమస్యలను ప్రస్తావించి.. ప్రభుత్వంలో కదలిక తీసుకురావడంతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక విశేష కృషి చేసిందని చెప్పారు. గత రెండేండ్లుగా ప్రతినెలా తమకు వేతనాలు ఆలస్యంగా వస్తున్న విషయాలను పత్రికలో ప్రస్తావించారని, దీంతో ఇప్పుడు క్రమం తప్పకుండా 2లోపు వేతనాలు జమ అవుతున్నాయని పేర్కొన్నారు.
దీంతోపాటు ‘హోంగార్డులకు ఆరోగ్య భద్రత కరువు’, ‘హోంగార్డులకు రైజింగ్ డే నిర్వహిస్తారా? లేదా?’, ‘కలగానే కారుణ్య నియామకాలు’, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాపై ‘జీవో తప్ప..జీవితం మారలే’ అనే వరుస శీర్షికలతో కథనాలు ప్రచురించారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హోంగార్డుల రైజింగ్ డే వేడుకల్లో కారుణ్య నియామకాలపై, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాపై డీజీపీ చేసిన ప్రకటలను కూడా ప్రముఖంగా ప్రచురించారని అభినందించారు.