Fee Reimbursement | ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారుకు ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి హెచ్చరిక చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలను బంద్ చేయిస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది. రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వకుంటే మళ్లీ బంద్ తప్పని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ ఎన్ రమేశ్ హెచ్చరించారు. రూ.1200 కోట్లకు రూ.300 కోట్లే ఇచ్చారని రమేశ్ ఆరోపించారు. నవంబర్ ఒకటో తేదీలోగా మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాల్సిందేనన్నారు. మిగతా బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫీజు బకాయిలు చెల్లించకుంటే కాలేజీలు నడుపలేమని.. మంత్రులు తమకు సహకరించడం లేదని ఆరోపించారు. బకాయిలు అడిగితే మాపై విచారణలు చేస్తున్నారని విమర్శించారు. భయపెడితే ఊరుకోమని.. ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి రానివ్వమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఫీజు రీయింబర్స్ విషయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇటీవల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్కు పిలుపునివ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుసార్లు బకాయిల చెల్లించకపోతే బంద్కు వెళ్తామని కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200కోట్ల వరకు ఉండగా.. దీపావళిలోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఇప్పటి వరకు కేవలం రూ.200కోట్లు మాత్రమే చెల్లించారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. రూ.8వేలకోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పేర్కొంటున్నది.