హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఒకరికి బదులు మరొకరికి చెల్లించిన పరిహారాన్ని రికవరీ చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసే అధికారం లోకాయుక్తాకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
తోటపల్లి రిజర్వాయర్ భూసేకరణకు చెల్లించిన పరిహారాన్ని లోకాయుక్త ఉత్తర్వుల మేరకు డిపాజిట్ చేయాలని హుస్నాబాద్ ఆర్డీవో నోటీసు జారీచేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎస్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఇటీవల స్పష్టం చేసింది. చట్టపరమైన విధానం మేరకు బాధితుడు దరఖాస్తు చేసుకోవచ్చని విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.