హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒకే అంశానికి సంబంధించి అధిక సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదుకావడం, ప్రాథమిక విచారణ లేకుండా పోలీసులు 30 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై స్పందించిన కొణతం దిలీప్..
ఇది మలి విజయమని, సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ పోటీ నుంచి వైదొలిగిన అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను ఆధారం చేసుకొని, నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో కొణతం దిలీప్‌పై అక్రమ కేసు నమోదుచేశారు. ఆ కేసును కొట్టివేయాలంటూ కొణతం దిలీప్ వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఈ కేసులో తదుపరి చర్యల మీద స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.