హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న క్రిమినల్ కేసులో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చుక్కెదురైంది. ఆ కేసు నుంచి తన పేరును తొలగించాలన్న శ్రీధర్‌బాబు విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. తీవ్రమైన అభియోగాలతో నమోదైన ఆ కేసులో విచారణ ఎదురొనాల్సిందేనని ఆయనకు తేల్చి చెప్పింది. అయితే, ఆ విచారణ కోసం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు మినహాయింపు కల్పించింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ప్రజలతో కలిసి నిరసన పేరిట నాటి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు కుర్చీలను విరగ్గొట్టి అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై 2017 ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీసు స్టేషన్లో శ్రీధర్‌బాబుతోపాటు 300 మందిపై కేసు నమోదైంది.
ఆ తర్వాత ఆ కేసు హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ కావడంతో తనపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని, ఆ కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ శ్రీధర్‌బాబు డిశ్చార్జి పిటిషన్ వేశారు. ఈ ఏడాది నవంబర్ 22న ప్రజాప్రతినిధుల కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ శ్రీధర్‌బాబు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూకావడంతో జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.