హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని భూముల వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను సింగిల్ జడ్జీలు విచారించి మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించారు. సర్వేనంబర్ 83/1, 83/పార్ట్ లోని 11.12 ఎకరాలపై హకులు ఉన్నాయని పేరొంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారించారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పిటిషనర్లు ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ)ను ఆశ్రయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టంచేసింది. ఎల్‌ఆర్‌టీ ముందు పునర్విచారణ లేదా ఇతర ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్టు నిరూపించకుండా, కేవలం ఆ అంశం ఆధారంగా ప్రభుత్వ వేలాన్ని మధ్యంతర ఉత్తర్వులతో అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. రాయదుర్గం సర్వేనంబర్ 83/1లోని ప్లాట్ల వేలాన్ని సవాల్ చేస్తూ ఎస్ రవీంద్రనాథ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, హెచ్ఎండీఏను ఆదేశించిన కోర్టు.. ఈ పిటిషన్ విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేసింది.