హైదరాబాద్, ఆగస్టు 20 ( నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి గెలిచాక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణ శుక్రవారం కొనసాగనున్నది.