హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవోను తక్షణమే తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు నెలల వ్యవధిలోగా అర్హుడైన అధికారిని పూర్తిస్థాయి సీఈవోగా నియమించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు ఆదేశాలు జారీచేసింది. వక్ఫ్ చట్టం-1995లోని సెక్షన్ 23 ప్రకారం వక్ఫ్ ప్రస్తుత సీఈవో నియామకం జరగలేదని తప్పుపట్టింది. వక్ఫ్ బోర్డు ఎండీ అసదుల్లాను తక్షణమే పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి తొలగించాలని న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈసీవో నియామకం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. తాతాలిక సీఈవోగా షేక్ లియాకత్ హుస్సేన్‌ను కొనసాగించవచ్చని వెల్లడించారు.
కొత్త సీఈవో నియామకం వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 23కు లోబడి ఉండాలని స్పష్టంచేశారు. గోలొండకు చెందిన మహ్మద్ అక్బర్ దాఖలు చేసిన కోర్టు ధికార పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీచేసింది. అడిషనల్ కలెక్టర్ హోదాలో ఉన్న అసదుల్లా వక్ఫ్ బోర్డు సీఈవోగా కొనసాగేందుకు అవసరమైన అర్హతలు లేవని పిటిషనర్ వాదించారు. అసదుల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరని, ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ స్థాయి కంటే తకువ హోదాతో ఉన్నారని, ఆయన నియామకం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 23కు అనుగుణంగా లేదని చెప్పారు. ముస్లిం అధికారులు తగిన సంఖ్యలో లేనందున 35 ఏండ్లపాటు ప్రభుత్వ సేవలందించిన ప్రస్తుత ఎండీ అసదుల్లాను సీఈవోగా నియమించేందుకు ఆమోదం తెలిపామన్న వక్ఫ్ బోర్డు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.