హైదరాబాద్ జూలై 15 (నమస్తే తెలంగాణ): మొదటి కాన్పులో కవలలు పుట్టినా రెండో ప్రసవంలో ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. మొదటి కాన్పులో కవలలు పుట్టారని, ఇద్దరు పిల్లలు జీవించి ఉన్నారన్న కారణంగా రెండో ప్రసవానికి ప్రసూతి సెలవు నిరాకరించడం చెల్లదని, ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణానికి విరుద్ధమని స్పష్టంచేసింది.
మొదటి కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పుకు చట్టప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. మొదటి కాన్పులో కవలలున్నారన్న కారణంగా ప్రసూతి సెలవును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎస్సీ గురుకుల సొసైటీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జాడి స్వరూపరాణి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కే శరత్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రసూతి సెలవు నిబంధనలను సంక్షేమ దృక్పథంతో, మహిళల హకులను పరిరక్షించే విధంగా చూడాలి తప్ప యాంత్రికంగా అమలు చేయరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని గుర్తుచేశారు.