e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides ఆ భూముల్లో సర్వే వద్దు ఎందుకొద్దు?

ఆ భూముల్లో సర్వే వద్దు ఎందుకొద్దు?

ఆ భూముల్లో సర్వే వద్దు  ఎందుకొద్దు?
  • ఈటల జమున పిటిషన్‌పై హైకోర్టు సూటి ప్రశ్న
  • భూముల సర్వేపై భయమెందుకని వ్యాఖ్య
  • కొలిస్తేనే కదా ఏ భూమి ఎవరిదో తేలేది?
  • సర్వే వద్దంటే ఆక్రమణదారులు తేలేదెలా?
  • ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన న్యాయమూర్తి
  • సర్వేపై స్టేకు నిరాకరణ.. రిట్‌ పిటిషన్‌ డిస్మిస్‌
  • రెండు లేదా మూడోవారంలో సర్వేకు ఆదేశం

హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరీస్‌ ఆవరణలో అసైన్డ్‌ భూములు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా భూముల సర్వే చేస్తామని రెవెన్యూ అధికారులు నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఈటల రాజేందర్‌ భార్య ఈటల జమున హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సర్వేపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. సర్వేను నిలిపివేసేలా స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు. సర్వేపై భయమెందుకని, విచారణ జరుగకుంటే ఆక్రమణదారులను ఎలా గుర్తిస్తారని పిటిషన్‌దారును నిలదీశారు. జూన్‌ రెండో వారంలో లేదా మూడో వారంలో సర్వే చేసేందుకు తేదీని నిర్ణయించాలని తాసిల్దార్‌ను ఆదేశించారు.

సర్వే జరుగాల్సిందే

విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఈటల జమున తరఫు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డిని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో భూముల సర్వేకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ‘సర్వే చేస్తేనే కదా ఏ భూమి ఎవరిదో, భూమి ఆక్రమణకు గురైందో లేదో తెలుస్తుంది? భూముల వ్యవహారం తేలేవరకూ అక్కడి నిర్మాణాలను కూల్చవద్దని లేదా.. ఇతరత్రా చర్యలు తీసుకోవద్దని కోరడంలో అర్థం ఉంటుంది.. అసలు సర్వేనే వద్దంటే ఎలా? సర్వే చేయకపోతే భూముల వాస్తవ స్థితిగతులు ఎలా తేలుతాయి?’ అని ప్రశ్నించింది. సర్వే జరుగాల్సిందేనని తేల్చి చెప్పింది. సర్వే చేయకపోతే ఎవరు ఆక్రమణదారులో ఎలా తేలుతుందని ఘాటు వ్యాఖ్య చేసింది. సర్వే చేస్తే తప్పు ఏమిటో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అవి అసైన్డ్‌ భూములని ప్రభుత్వం చెప్తున్నదని, సర్వే చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని వ్యాఖ్యానించింది. సర్వేను నిలిపివేయాలన్న ఈటల జమున అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. జూన్‌ రెండు లేదా మూడో వారంలో వివాదస్పద భూములను సర్వే చేయాలని, సర్వే తేదీలను మాసాయిపేట తాసిల్దార్‌ నిర్ణయించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

అసైన్డ్‌దారుల ఫిర్యాదు మేరకే సర్వే: ఏజీ

తమ భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ అసైన్డ్‌దారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే భూముల బాగోతాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌దారులు సర్వేను వద్దంటున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. సర్వే చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సర్వే చేయడానికి గడువు కావాలంటే ఇచ్చేందుకు, అవసరమైతే వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న నేపథ్యంలో సర్వేకు అంగీకరించాలని కోరారు. ఆదేశాలు జారీ చేసే అధికారం ఆర్డీవోకు ఉన్నదని స్పష్టం చేశారు. గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సాకుగా చూపించి సర్వేను అడ్డుకుంటున్నారని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా చేస్తున్నారని గతంలో ఇదే హైకోర్టులో అడ్డుకున్నారని, ఇప్పుడు నోటీసు ఇస్తే దీనిపై స్టే కోరుతున్నారని గుర్తు చేశారు. నోటీసు, ఆపై వివరణకు గడువు ఇవ్వాలని ఇదే హైకోర్టు చెప్పిందన్నారు. పిటిషనర్‌తోపాటు సరిహద్దు రైతులకు కూడా సర్వేకు హాజరుకావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని చెప్పారు.

సర్వే చేయకుండా నిజాలు నిగ్గుతేలవు: రాష్ర్ట ప్రభుత్వం

సర్వే చేయకుండా భూముల వాస్తవ పరిస్థితులు తేలవని, ఈ విషయం తెలిసీ సర్వేను అడ్డుకునేందుకు పిటిషనర్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ప్రసాద్‌ వాదించారు. గతంలో సరిహద్దు భూ యజమానులకు నోటీసు ఇవ్వకుండా తమ భూముల్లోకి అధికారులు వచ్చారని ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు నోటీసు జారీ చేసి సర్వే చేస్తామంటే వద్దంటున్నారని పేర్కొన్నారు. పిటిషనర్‌ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సర్వేపై స్టే ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరారు. వాస్తవాలు తేలాలని, భూములు ఎవరివో, ఆక్రమించిన భూముల్లో ఎవరున్నారో తేల్చాలంటే సర్వే జరుగాలని స్పష్టంచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ భూముల్లో సర్వే వద్దు  ఎందుకొద్దు?

ట్రెండింగ్‌

Advertisement