హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, కోర్టు సమయాన్ని వృథా చేసిన ఓ వ్యక్తికి హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లో ప్రధాని కొవిడ్ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించింది. లేనిపక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ మొత్తాన్ని వసూలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిర్దేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. గ్యాంగ్‌స్టర్ అఖిలేశ్ పాల్ ఫుట్‌బాల్ కోచ్‌గా మారిన నేపథ్యంలో అతని జీవితం ఆధారంగా నిర్మించిన ఝుండ్ సినిమా విడుదలను నిలిపివేయాలని చిన్నిప్రకాశ్ అనే వ్యక్తి గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. ఆ తరువాత టీ సిరీస్ సంస్థతో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకొని రాజీ చేసుకున్నారు. దీంతో చిత్ర నిర్మాతలు సినిమాను శుక్రవారం విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఇంతలోనే చిన్నికుమార్ తాను కుదుర్చుకున్న రాజీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో దావా వేశారు. కోర్టు నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడకముందే శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది. జిల్లా కోర్టులో వేసిన దావా విషయాన్ని పేర్కొనకపోవడాన్ని తప్పు పట్టింది. ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా రిట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. రిట్‌పై హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన సందేహాలను ఆమోదిస్తున్నట్టు తెలిపింది. పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.