హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్‌రావుకు హైకోర్టు మంజూరుచేసిన మధ్యంతర బెయిల్‌ను ఈ నెల 12 వరకు పొడిగించింది. రాజకీయ కక్షతో చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదు చేసిన ఫోన్‌ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ జరిపారు. హరీశ్‌రావు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.
అయితే, ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా విచారణకు హాజరుకాలేకపోయారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు చెప్పారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సీనియర్ అడ్వకేట్ రావడం లేదన్న విషయాన్ని ముందుగానే పిటిషనర్లకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అన్నారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ముందుగా తెలిసినప్పుడు ముందుగానే సమాచారం ఇవ్వాలని, పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కూడా ఢిల్లీ నుంచే వచ్చారని గుర్తుచేశారు. చివరికి తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. ఆరోజు తప్పకుండా వాదనలు వినిపించాలని, మళ్లీ వాయిదా కోరవద్దని ఇరుపక్షాలకు తేల్చి చెప్పారు.