హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొంత క్యాడర్‌కు వెళ్లాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏఐఎస్ అధికారులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందేనని తేల్చిచెప్పింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏమాత్రం ఆసారం లేదని స్పష్టంచేసింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు పరిపాలనా పరమైన నిర్ణయమని, ఆ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులు వెలువరించిదని గుర్తుచేసింది. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను పట్టించుకోకుండా కేంద్రం ఈ నెల 9న గత కేటాయింపులనే ఖరారు చేసిందంటూ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ జరిపింది.
తెలంగాణలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్‌లు, ఏపీలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలుచేసిన ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఐఏఎస్ అధికారులను ప్రస్తుతం వారున్న స్థానంలోనే కొనసాగించాలని కోరుతూ రెండు రాష్ర్టాలు కేంద్రానికి లేఖలు రాశాయని, 15 రోజుల పాటు కేంద్రం ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వచ్చే నెల 4వ తేదీన క్యాట్‌లో ఈ కేసు విచారణ ఉందని, కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇవ్వని నిపక్షంలో క్యాట్‌లో కేసు తేలే వరకు మధ్యంతర స్టే అయినా ఇవ్వాలని, ఇదీ కుదరనిపక్షంలో కనీసం వచ్చే నెల 4వ తేదీ వరకు అయినా స్టే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎంతకాలం స్టే ఉత్తర్వులతో కొనసాగుతారని, స్టే ఆదేశాలు జారీ చేసుకుంటూపోతే ఎప్పటికీ ఈ వ్యవహారం కొలికిరాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెండు రాష్ర్టాల్లో పాలన ఈ అధికారులపైనే నడుస్తున్నదా? వారు లేకపోతే పాలన సాగదా? అని ప్రశ్నించింది.
అధికారులను రిలీవ్ చేసిన ప్రభుత్వాలు
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. సొంత క్యాడర్‌కు వెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, ప్రశాంతిని రిలీవ్ చేసింది. అంతకుముందు ఐఏఎస్‌లు సీఎస్ శాంతికుమారితో సచివాలయంలో వారు భేటీ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. అనంతరం వారు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌లు శ్రీజన, శివశంకర్ హైదరాబాద్‌కు వచ్చి రిపోర్ట్ చేశారు. దీంతో కొన్నాళ్లుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలకు తెరపడినట్టయ్యింది. అయితే తెలంగాణలో పనిచేస్తున్న ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిష్త్‌కు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. వారిని ప్రభుత్వం బుధవారం రాత్రి వరకు రిలీవ్ చేయలేదు. వారికి సంబంధించిన డీవోపీటీ ఆదేశాలు ఇంకా అందలేదని, అందుకే రిలీవ్ చేయలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి.
ఆరుగురికి పూర్తి అదనపు బాధ్యతలు ..
రిలీవ్ అయిన ఐదుగురు ఐఏఎస్‌ల స్థానంలో వారి బాధ్యతలను మరో ఐదుగురు ఐఏఎస్‌లకు కేటాయిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు, ఇంధనశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియాకు, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్టినా జడ్ చొంగ్తుకు, మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ రొనాల్డ్‌రోస్ సతీమణి విశాలాచ్చి కొన్నాళ్లుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ఆమె స్థానంలో ఆర్వీ కర్ణన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.