OMC Case | ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మీని దోషిగా తేల్చింది. న్యాయస్థానం తీర్పుతో శ్రీలక్ష్మీని సీబీఐ విచారించనున్నారు.
ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం 2006లో శ్రీలక్ష్మీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదలైందని.. లీజు వ్యవహారంలో శ్రీలక్ష్మీ అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. లీజు కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించి, అక్రమ రీతిలో అనుమతులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఆమె అక్రమాలకు పాల్పడ్డారని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాధారాలు పరిశీలించాకే శ్రీలక్ష్మీ పిటిషన్పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది.
ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలని శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్ను 2022 అక్టోబర్లో సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆమె రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు అనుమతించిన హైకోర్టు.. శ్రీలక్ష్మీని కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది. అయితే దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ జరపాలంటూ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు పంపించింది. ఈ క్రమంలో సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం.. శ్రీలక్ష్మీ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది.