హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): అమెరికా కోర్టులో ఎఫ్‌బీఐ పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ నుంచి రెడ్‌కార్నర్ నోటీసు జారీకావడంపై వివరణ ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర హోంశాఖను, విదేశాంగ శాఖను ఆదేశించింది. ఏపీ విభజనకు ముందు ఈ పిటిషన్ దాఖలైనందున తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. టైటానియం గనుల లీజుకు సంబంధించి స్విట్జర్లాండ్‌కు చెందిన బౌతీ ట్రేడ్ ఏజీ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవడం వెనుక కుట్ర ఉన్నదంటూ అమెరికా కోర్టులో ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది. దీంతో 2014 ఏప్రిల్ 28న తనకు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయడాన్ని సవాలు చేస్తూ కేవీపీ అప్పుడే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ బుధవారం తాజాగా మరోసారి విచారణ చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.