హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారుచేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించారని అభిప్రాయపడింది. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) చేయాల్సిన అవసరం ఏమున్నదని నిలదీసింది. స్వయంగా ముఖ్యమంత్రే పీపీటీని ప్రదర్శించడాన్ని తప్పుపట్టింది. ఈ సంక్షిప్త నివేదికను పబ్లిక్ డొమైన్స్ నుంచి వెంటనే తొలిగించాలని ఆదేశించింది. ఘోష్ కమిషన్ ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని, విచారణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగనందున కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం వాదనలు కొనసాగాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు విన్నది. ‘కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారా? లేక చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో ప్రవేశపెడతారా..’ అని గురువారం ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఆ అంశంపై స్పందిస్తూ.. కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడతుందని, దానిపై చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని, ఈలోగా కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒక నోట్‌ను ధర్మాసనానికి అందజేశారు.
అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి మాత్రమే ఇచ్చిన 650 పేజీల నివేదికను నీటిపారుదల/జీఏడీ ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శితో కూడిన కమిటీతో 60 పేజీలకు సంక్షిప్తం చేయించడం, ఆ నివేదికను బహిర్గతం చేయడాన్ని హైకోర్టు పక్షపాత చర్యగా అభివర్ణించింది. సంక్షిప్త నివేదికలోని విషయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నందున నష్టం జరుగుతుందని పిటిషనర్లు ఆందోళన వెలిబుచ్చడంలో అర్థం ఉన్నదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటే పరువు, ప్రతిష్ట పోతుందనే ఆందోళన సబబేనని పేర్కొన్నది. నివేదికపై శాసనసభలో చర్చించేవరకు అందులోని విషయాలు వెల్లడికావడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టంచేసింది. సమ్మరీ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది.
నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ అయ్యే పరిస్థితులను ఎందుకు కల్పించిందని ప్రశ్నించింది. పిటిషనర్లను (కేసీఆర్, హరీశ్) కమిషన్ సాక్షులుగా సెక్షన్ 5(2) కింద విచారణకు పిలిచిందనే విషయాన్ని ప్రస్తావించింది. సమ్మరీ రిపోర్టులో ఆ ఇద్దరిపై అభియోగాలు ఉన్నాయనే వాదనలను ఉంటంకించింది. ఆరోపణలు చేసే అంశాలు కమిషన్ వద్ద ఉన్నప్పుడు, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8-బీ, 8-సీ ప్రకారం తమకు నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నది.
అయితే, కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తదుపరి నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చినందున పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ప్రభుత్వ హామీ నేపథ్యంలో నివేదికపై స్టే అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌కు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలోని అంశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని తెలిపారు. కమిషన్ గోప్యంగా సమర్పించిన రిపోర్టులోని కీలక విషయాలన్నీ సంక్షిప్త నివేదిక పేరుతో స్వయంగా ముఖ్యమంత్రే ప్రజంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని చెప్పారు.
సాక్షులుగా విచారణకు హాజరైన పిటిషనర్లు ఇద్దరిపైనా కమిషన్ అభియోగాలు చేసినట్టు ఆ సంక్షిప్త రిపోర్టులో ఉందని అన్నారు. కమిషన్ రిపోర్టు ఇవ్వాలని పిటిషనర్లు కోరినప్పటికీ ఇవ్వలేదని, బ్రీఫ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో, వెబ్‌సైట్స్‌లో ఉంటడంతో పిటిషనర్ల రాజకీయ జీవితంపై మచ్చ పడే ప్రమాదం ఉందని తెలిపారు. నివేదికను సంక్షిప్తం చేసి మీడియాకు అందేలా చేసిన ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో గమనించాలని కోరారు. సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ వల్ల తీరని నష్టం చేకూరిందని తెలిపారు. ఇది కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా పిటిషనర్లపై ప్రభుత్వం ఏకపక్షంగా దాడి చేయడమేనని అన్నారు. సాక్షులుగా హాజరైన పిటిషనర్లపై కమిషన్ ఆరోపణలు చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమంటూ చట్ట నిబంధనలను ఉదహరించారు.
విచారణ కమిషన్ చట్టం- 1952లోని సెక్షన్ 8-బీ, 8-సీ కింద నోటీసులు ఇచ్చి ఆరోపణలు చేసిన ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కమిషన్ అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ఎల్ కే అద్వానీ, కిరణ్‌బేడీ కేసులలో సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కమిషన్ చర్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకోకపోయినా అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టాక పిటిషనర్లు కోర్టు ద్వారా ఉపశమనం కావాలని కోరినప్పటికీ ప్రయోజనం ఉండదని అన్నారు. కాబట్టి తక్షణమే నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున వాదిస్తున్నట్టు గురువారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి చెప్పారు. ధర్మాసనం గురువారం జారీచేసిన ఉత్తర్వుల్లో కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి అని పేరొంది. శుక్రవారం కూడా నిరంజన్‌రెడ్డి ఆన్లైన్లోనే హైకోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు కూడా వినిపించారు. వాదనలు ఎవరి తరఫున చేస్తున్నారనే సందేహాన్ని పిటిషనర్ న్యాయవాది వ్యక్తంచేశారు. కేసు విచారణ ముగిశాక ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించే దశలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుని, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి విచారణ కమిషన్ తరఫున వాదించడం లేదని చెప్పారు.
రెండు పిటిషన్లలో (కేసీఆర్, హరీశ్‌రావు) ఒక పిటిషన్లో ప్రతివాదులైన ప్రభుత్వ అధికారుల తరఫున ఆయన వాదించారని చెప్పడంతో ధర్మాసనం ఒకింత విస్మయానికి గురైంది. మూడో ప్రతివాది (విచారణ కమిషన్) తరఫున వాదిస్తున్నట్టు స్వయంగా నిరంజన్‌రెడ్డే గురువారం జరిగిన విచారణ సమయంలో చెప్పారని రెండుసార్లు గుర్తుచేసింది. దీనిపై ఏజీ స్పందిస్తూ కాదు.. కాదు, ప్రభుత్వ అధికారుల తరఫున వాదిస్తున్నారని చెప్పడం గమనార్హం. ఏజీ ఈ ప్రస్తావన చేసినప్పుడు ఆన్లైన్ విచారణకు హాజరైన నిరంజన్‌రెడ్డి అప్పటికే వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల్లో నిరంజన్‌రెడ్డి ప్రభుత్వ అధికారుల తరఫున వాదించినట్టు రికార్డయింది. ఇంతకీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు న్యాయవాది ఉన్నారా.. లేరా..అని న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్ నివేదికలో పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. సీఎంగా, మంత్రిగా తీసుకున్న చర్యలపై విచారణ చేపట్టవచ్చునని, నివేదికలోని అంశాలు గోప్యంగానే ఉంటాయని చెప్పారు. పరిపాలనాపరమైన వైఫల్యాలపై ఫైండింగ్స్ ఉన్నాయన్నారు అసెంబ్లీలో రిపోర్టు నివేదించాక అదే సభలో సభ్యులైన పిటిషనర్లు ఇద్దరూ చర్చలో పాల్గొనేందుకు వీలుంటుందని చెప్పారు. పిటిషనర్లకు 8-బీ, 8-సీ నోటీసులు ఇవ్వనకర్లేదని అన్నారు. కమిషన్ విచారించిన 119 మంది సాక్షుల విచారణలో చిట్టచివరి వ్యక్తులు పిటిషనర్లేనని, ఎల్ కే అద్వాణీ, కిరణ్‌బేడీ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని చెప్పారు.
కోట్ల విజయభాసర్‌రెడ్డి కేసులో నోటీసుల జారీలో అన్ని అంశాలు పేరొనలేదని తెలిపారు. రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించేవరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు ఉండబోవని చెప్పారు. 60 పేజీల్లో బ్రీఫ్ రిపోర్టు మీడియాకు చేరిందని, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఆ నివేదిక లేదని అన్నారు. పిటిషనర్లు కమిషన్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేయలేదని అన్నారు. కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేస్తుందని, కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని అన్నారు. స్టే ఆదేశాలు అవసరం లేదని చెప్పారు.