హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడు బండి సాయిభగీరథ్‌కు శుక్రవారం రాష్ట్ర హైకోర్టులో అరెస్టు నుంచి ఊరట లభించలేదు. ఈ కేసులో బాధితురాలు, పోలీసులిచ్చిన వివరాలు, ఆమె వాంగ్మూలం, పత్రాలు, తీర్పులను పరిశీలించేందుకు సమయం కావాలని, తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ టీ మాధవీదేవి ప్రకటించారు. వచ్చే వెకేషన్ బెంచ్ ఈ నెల 21న గురువారం జరుగుతుందని, అప్పుడు తీర్పు చెప్తామని తెలిపారు. దీనిపై బండి భగీరథ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, తీర్పు వెలువరించే వరకు పిటిషనర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని కోరగా అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. వెకేషన్ బెంచ్ ఉన్నప్పుడే తీర్పు చెప్పాలని లేదని, రేపైనా తీర్పు చెప్పవచ్చునని న్యాయవాది సూచించగా, పరిశీలిస్తామని చెప్పి న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయారు.
పోలీసుల దర్యాప్తునకు భగీరథ్ పూర్తిగా సహకరిస్తాడని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని మరోసారి నిరంజన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమని తేల్చిచెప్పారు. భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాదనలు 11.45 వరకు కొనసాగాయి.
విచారణ సందర్భంగా న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. డిసెంబర్లో ఘటన జరిగితే మార్చిలో ఫిర్యాదుదారు న్యాయపరమైన చర్చలు జరిపారని, ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారని, జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినపుడు చేర్చిన సెక్షన్ల ప్రకారం శిక్ష ఐదేండ్లలోపు పడుతుందని, అప్పుడు అరెస్ట్ అవసరంలేదన్నారు. దీనిని గమనించిన పోలీసులు కావాలని మరో రెండు సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చి కేసును జటిలం చేశారని అన్నారు.
బాధితురాలి పుట్టిన తేదీలను రెండుగా చూపే ఆధారాలను సీల్డ్కవర్లో కోర్టుకు అందజేశారు. పిటిషనర్, బాధితురాలు రిలేషన్షిప్లో ఉన్నారని, జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటికిరావడంతో కేసు పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. తల్లి చెప్తున్న తేదీల తర్వాత కూడా బాధిత బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని తెలిపారు. బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో ఉన్నదని, ఫోన్ మెసేజ్‌లు, ఫొటోలను పరిశీలిస్తే ఇష్టపూర్వకంగానే ఆమె మద్యం సేవించినట్టు తెలుస్తుందని చెప్పారు.
నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి తరఫు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు ఆరోపించారు. కేంద్రమంత్రి బెదిరింపులతోనే ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదని చెప్పారు. తన కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టనని బెదిరించారని చెప్పారు. తన కోసం చాలామంది చనిపోయారని నిందితుడి తండ్రి ప్రకటన ఇచ్చారని గుర్తుచేశారు. పిటిషనర్‌కు పోలీసులు సహకరిస్తున్నారని అన్నారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సాయంత్రం 5.00 గంటలకు వెళ్తే రాత్రి 10.30 గంటలకు కేసు నమోదు చేశారని చెప్పారు.
తాము ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న సమాచారాన్ని పోలీసులు పిటిషనర్‌కు తెలియజేసి తమ కంటే ముందుగా తమపై కరీంనగర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యేలా సహకరించారని తెలిపారు. 2021లో బాలికపై డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన కేసు వివరాలు కూడా పోలీసులే పిటిషనర్‌కు అందజేశారని చెప్పారు. నిందితుడు భగీరథ్ తండ్రి కేంద్ర హోంమంత్రి కావడంతోనే పోలీసులు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. పిటిషనర్ తండ్రి ఉన్నత పదవిలో ఉన్నారని, ఇలాంటి నేపథ్యంలో పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎఫ్ఐఆర్ దశలోనే నిందితుడికి రక్షణ కల్పించకూడదని, పోక్సో కేసులో బాధితురాలికి అండగా నిలబడాలని పప్పు నాగేశ్వర్రావు కోరారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా బండి భగీరథ్ అరెస్టు కాకుండా రక్షణ కల్పించొద్దని వాదించారు. తీవ్ర అభియోగాల కేసు కాబట్టి ఏ కోణంలో చూసినా నిందితుడిని పోలీసులు విచారించి అరెస్టు చేయాల్సిందేనని చెప్పారు. ఏడేండ్లలోపు శిక్ష పడే నేరాభియోగాలు కాదని, తీవ్ర అభియోగాల కేసు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని అన్నారు. బాధితురాలు మేజర్ అని పిటిషనర్ చెప్పడం సరికాదని రికార్డుల ప్రకారం బాధితురాలు మైనర్ అని చెప్పారు.
పిటిషనర్ తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు బాధితురాలిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నాగేశ్వర్రావు చెప్పారు. బాధితురాలు రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న పిటిషనర్ ఆరోపణలో నిజం లేదని అన్నారు. అంతకుముందు రూ.50 వేలను బాధితురాలికి ఇచ్చానని పిటిషనర్ చెబుతున్నారేగానీ ఆ మొత్తాన్ని బాధితురాలు తిరిగి పిటిషనర్‌కు ఇచ్చిన విషయాన్ని వెల్లడించడం లేదని తెలిపారు. పిటిషనర్ తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అతి విశ్వాసానికి బ్రేక్ వేయాలని కోరారు. సీఆర్పీసీలో ఏ సెక్షన్ ప్రకారం పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడికి రక్షణ కల్పిస్తారు? అని ప్రశ్నించారు.
‘దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పి అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలి. గత ఏడాది డిసెంబర్ 31న విభేదిస్తే మే 8వ తేదీ వరకు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించి ఉపశమనం పొందలేరు. బాధితురాలు మైనర్. ఫిర్యాదుదారైన తల్లి అనేక కోణాల్లో బాధితురాలైన కుమార్తె గురించి ఆలోచిస్తుంది. కేసుల వారీగా సమస్యను చూడాలి. కేసులోని ఆరోపణలు, ఆధారాలు పరిశీలించాలి. పోలీసులు బాధితురాలి నుంచి స్వీకరించిన 161 స్టేట్మెంట్ తర్వాత పోక్సో చట్టంలో 5, 6 సెక్షన్లు చేర్చుతూ ఎఫ్ఐఆర్లో మార్పులు చేయడాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించాలి’ అని పప్పు నాగేశ్వర్రావు వాదించారు.
బాధితురాలిపై కరీంనగర్లో కౌంటర్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని పప్పు నాగేశ్వర్రావు ప్రశ్నించారు. ఆమె అక్కడ నివాసం ఉండటంలేదు, హనీట్రాప్ అనుకున్నా అక్కడేమీ డబ్బు తీసుకోలేదని చెప్పారు. నిందితుడి తండ్రి కరీంనగర్ ఎంపీ కావడంతోనే అక్కడ కేసు నమోదైందని అన్నారు. కేసు నమోదులో జాప్యంపై ముఖ్యమంత్రి అడిగితే ప్రధానమంత్రి భద్రతలో ఉన్నట్టు చెప్పారని అన్నారు. అంటే ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పెండ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి వాడుకొని వదిలేశారని తెలిపారు. మైనర్‌తో స్వచ్ఛందంగా లైంగిక చర్యకు పాల్పడినా చట్టం అనుమతించదని అన్నారు.
నిందితుడిపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయని, దీన్నిబట్టి అతని చరిత్ర తెలుస్తుందన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదని, ఇలాంటి వారు మరో నలుగురున్నారని వాళ్లు కూడా త్వరలో బయటికి వస్తారని చెప్పారు. ‘పుట్టిన తేదీకి సంబంధించి ఏది ప్రామాణికమన్నది చట్టంలోనే స్పష్టంగా ఉంది. దీని ప్రకారం పాఠశాల రికార్డులు, జీహెచ్ఎంసీ రికార్డులున్నాయి’ అని తెలిపారు. వయస్సు గురించి వివాదం ఉంటే కోర్టు విచారణలో తేల్చుకోవాలి.. ముందస్తు బెయిల్ పిటిషన్లో కాదని అన్నారు. పోలీసులు ఇచ్చిన ధైర్యంతో ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, తీవ్రమైన ఆరోపణలున్న కేసులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు.
పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ సవరించకపోయినా మొదటి ఫిర్యాదులోనే తీవ్రమైన ఆరోపణలున్నాయన్నాయని చెప్పారు. ఈ ఆరోపణలకు పోక్సో కేసులోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని, పోక్సో కేసు నమోదైతే నిందితుడు ముందస్తు బెయిల్‌కు అనర్హుడని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా ఏమీ కాదని, ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సవరించే అధికారం పోలీసులకు ఉన్నదని తెలిపారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లు చేర్చారని, మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతపు లైంగికచర్యకు పాల్పడినట్టు ఆరోపణ ఉన్నదని చెప్పారు. నవంబరు 13న తల్లిదండ్రులు లేరని తెలిసి మద్యం కలిపి ఇచ్చిన పానీయాన్ని ఇచ్చినట్టు బాలిక వాంగ్మూలంలో వివరించారని తెలిపారు.
ఎఫ్ఐఆర్ 8న నమోదు కాగా 9న బాలిక వాంగ్మూలం ఇచ్చిందని చెప్పారు. బాలిక పదో తరగతి సర్టిఫికెట్‌ను పరిశీలించి పుట్టిన తేదీని ధ్రువీకరించారని తెలిపారు. రెండు రకాలైన తేదీలు ఉండటాన్ని గమనించిన పోలీసులు జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఫెర్నాండెజ్ దవాఖాన నుంచి ధ్రువీకరణ పొందారని చెప్పారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం బాలిక పుట్టిన తేదీ 12 ఆగస్టు 2008 అని స్పష్టమైందని చెప్పారు. దీని ప్రకారం బాధితురాలి వయస్సు ఇప్పటికీ 18 ఏండ్లలోపేనని వివరించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఎఫ్ఐఆర్లోని తీవ్రమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదప్రతివాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. బండి భగీరథకు ఊరట కల్పించాలని, అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.