హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నూతన సాంకేతికతలు వేగంగా విస్తరిస్తుండటంతో సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆధునిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్, విమానాశ్రయ సుంకాలు, సైబర్ రంగాలకు సంబంధించిన వివాదాలను సకాలంలో పరిషరించాలని పిలుపునిచ్చారు.
సుదీర్ఘ కాలంపాటు కొనసాగే వ్యాజ్యాలు నియంత్రణ లక్ష్యాలను దెబ్బతీసి పరిశ్రమలకు, వినియోగదారులకు తీవ్ర అనిశ్చితిని కలిగిస్తాయని, లైసెన్సింగ్, స్పెక్ట్రమ్, సర్వీస్ నాణ్యత, టారిఫ్ వివాదాల్లో సమర్థ నిర్ణయాలు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణానికి దోహదపడతాయని స్పష్టం చేశారు. టెలికాం రంగంలో సంసరణల వల్ల 1997లో ట్రాయ్, 2000 సంవత్సరంలో టీడీశాట్ లాంటి ప్రత్యేక న్యాయ విచారణ వ్యవస్థలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ప్రత్యేక ట్రిబ్యునళ్లు న్యాయవ్యవస్థకు సహాయకారిగా ఉంటూనే, ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగ సమీక్షకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం, రాజీ లాంటి మార్గాలను ట్రిబ్యునళ్లు విసృ్తతంగా ప్రోత్సహించాలని సూచించారు.
సైబర్ వివాదాలు, ఆన్లైన్ మోసాలు నానాటికీ మరింత జఠిలంగా మారుతున్నాయని, ఇలాంటి అంశాల్లో న్యాయ విచారణకు కృత్రిమ మేధ (ఏఐ) లాంటి నూతన సాంకేతికతలు ఎంతో ఉపయోగపడగలవని, అయినప్పటికీ మానవ పర్యవేక్షణ, న్యాయ విచారణాధికారం, జవాబుదారీతనం స్థానాన్ని ఏఐ ఎన్నటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు. సైబర్ బాధితులకు వేగంగా న్యాయం అందించే పద్ధతులను టీడీశాట్ చైర్పర్సన్ జస్టిస్ డీఎన్ పటేల్ వివరించారు. ఐటీ చట్టం కింద దాఖలయ్యే నష్టపరిహార దావాలను ప్రాథమికంగా సంబంధిత రాష్ట్రాలు నిర్దేశించిన నిర్ణయాధికారులు విచారిస్తారని, వారు రూ.5 కోట్ల వరకు విలువైన నష్టపరిహార దావాలను పరిషరించేందుకు వీలుంటుందని తెలిపారు. రూ.5 కోట్లకు మించిన నష్టపరిహార దావాలను సివిల్ కోర్టుల ద్వారానే పరిషరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రారంభంలో టెలికాం రంగానికే పరిమితమైన టీడీశాట్ పరిధి క్రమంగా బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్ మరియు సైబర్ వివాదాల వరకు విస్తరించిందని, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏరా) చట్టం కింద విమానాశ్రయ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిషరించడంలో కూడా టీడీశాట్ కీలకపాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు. సదస్సులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ సామ్ కోషి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.